కర్ణాటకలో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే ముస్లిం బాలికల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాష్ట్ర జనాభాలో వాటా వారీగా చూస్తే వారి సంఖ్య ముస్లీమేతరుల కన్నా తక్కువగా ఉంది. అయితే ఇటీవల వారి జనాభా మాత్రం స్థిరంగా పెరుగుతున్నట్టు పలు ప్రభుత్వ సర్వేలు చెబుతున్నాయి.
నేషనల్ శాంపిల్ సర్వే వారి 64వ,75 రౌండ్ల యూనిట్ స్థాయి డేటా విశ్లేషణ ప్రకారం… 2007-08 నుంచి 2017-18లో ఉన్నత విద్యలో ముస్లిం మహిళల స్థూల హాజరు(జీఏఆర్) 6.7 శాతం నుంచి 13.5 శాతానికి పెరిగింది(ఇక్కడ జీఏఆర్ 18-23 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న కాలేజీలకు హాజరయ్యే మహిళల సంఖ్య). హిందూ మహిళల జీఏఆర్ 2007-08లో 13.4 శాతం ఉండగా, 2017-18లో 24.3 శాతానికి పెరిగింది.
హిజాబ్ వివాదం కొనసాగుతున్న కర్ణాటకలోనూ ఈ జీఏఆర్ పెరిగింది. రాష్ట్రంలో ఉన్నత విద్యలో ముస్లిం మహిళల జీఏఆర్ 2007-08లో 1.1 శాతంగా ఉండేది. ఆ సంఖ్య 2017-18లో 15.8 శాతానికి పెరిగింది. హిందూ మహిళల జీఏఆర్ 2007-08లో 11.8శాతంగా ఉండగా 2019-20లో 23.8 శాతానికి పెరిగింది.
యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎలిమెంటరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ (యూడీఐఎస్ సీ) డేటా ప్రకారం చూస్తే దేశీయంగా, అప్పర్ ప్రైమరీ (5 నుండి 8వ తరగతి)లో మొత్తం బాలికల నమోదులో ముస్లింల నమోదు వాటా 2015-16లో 13.30 గా ఉండేది. 2019-20కి వచ్చే వరకు ఈ సంఖ్య 14.54 శాతానికి పెరిగింది. కర్ణాటక రాష్ట్రంలో ఈ సంఖ్య 15.16 నుంచి 15.81కు పెరిగింది.