హైదరాబాద్ లో పోలీసులు అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపారు. అక్రమార్కులకు నిద్ర పట్టకుండా చేస్తున్నారు ఎక్సైజ్ పోలీసులు. మంగళవారం బాలానగర్ లోని బోరబండ ప్రాంతంలో దాడులు జరిపారు పోలీసులు.
విశాఖపట్నం నుండి హాశిష్ ఆయిల్ ను అక్రమంగా తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్దనుండి మొత్తం 774 గ్రాముల హాశిష్ ఆయిల్, ఒక మోటార్ వాహనం, ఒక సెల్ ఫోన్ స్వాధీన పర్చుకున్నట్టు అసిస్టెంట్ కమిషనర్ చంద్రయ్య పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని బురండి గ్రామానికి చెందిన అంపిలి బాలరాజు అనే వ్యక్తి.. వైజాగ్ కు చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి నుండి ఒక లీటర్ హాశిష్ ఆయిల్ ను 40,000 రూపాయలకు కొనుగోలు చేశాడు. దానిని రైలులో తీసుకువచ్చి బోరబండలోని తన గదిలో నిలువ ఉంచాడు. ఆ ఆయిల్ ను 5 నుండి 7 గ్రాముల వరకు చిన్న బాక్సుల్లో నింపి ఒక్కో బాక్స్ ను 1500 రూపాయలకు అమ్ముడు మొదలు పెట్టాడు నింధితుడు.
ఆ ఆయిల్ ను హైదరాబాద్ లోని మెహదీపట్నం, కూకట్పల్లి ప్రాంతాల్లో కొందరు వ్యక్తులకు గత కొంతకాలంగా విక్రయిస్తున్నట్టు రంగారెడ్డి జోన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు సమాచారం అందింది. దీంతో దాడులు నిర్వహించిన అధికారులు.. నింధితున్ని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఎక్కడెక్కడ అమ్ముతున్నాడు.. దీని వెనుక ఎవరున్నారు అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.