శాస్ర్తవేత్త స్టీఫెన్ హాకింగ్ ఇక లేరు

ఖగోళ శాస్ర్తవేత్త స్టీఫెన్ హాకింగ్ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌స్సు 76 ఏళ్లు. బుధవారం ఉదయం ఆయన చనిపోయినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. హాకింగ్‌కు ముగ్గురు పిల్లలు. లూసీ, రాబర్ట్, టిమ్‌లు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఫిజిక్స్ చదివిన హాకింగ్, ఖగోళ అంశాలపై అనేక సిద్ధాంతాలను ప్రతిపాదించారు. 1942 జ‌నవరి 8న లండ‌న్‌లో స్టీఫెన్ జ‌న్మించారు.

ప్రాథమిక విద్యను సెయింట్ ఆల్బన్స్ స్కూల్‌లో అభ్యసించారు. ఆపై ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో బీఏ, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో పీహెచ్‌డీ చేశారు. హాకింగ్ రేడియేషన్, పెన్‌రోజ్, హాకింగ్ ఫార్ములా, హాకింగ్ ఎనర్జీ, గిబ్సన్స్ – హాకింగ్ అన్సాట్జ్, ధ్రోన్ హాకింగ్ ప్రీస్కిల్ బెట్ వంటి ఆయన సిద్ధాంతాలు ఉత్సాహిక శాస్త్రవేత్తలకు మార్గదర్శకాలయ్యాయి. 1965లో జేన్ విల్డీని వివాహం చేసుకున్న ఆయన, 1995లో విడాకులు ఇచ్చి అదే సంవత్సరం ఎలానీ మాసన్‌ను మ్యారేజ్ చేసుకున్నారు. ఆమెకూ 2006లో విడాకులు ఇచ్చారు.

1963లో హాకింగ్‌కు మోటార్ న్యూరాన్ వ్యాధి సోకింది. ఆ తర్వాత ఆయన వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు. వీల్‌చైర్ నుంచి ఆయన అనేక విశ్వ రహస్యాలను చేధించారు. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తర్వాత అంతటి పరిశోధనలు చేసిన వ్యక్తిగా హాకింగ్‌కి పేరుంది. హాకింగ్ లైఫ్‌స్టోరీ ఆధారంగా హాలీవుడ్‌లో థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ సినిమాను రూపొందించారు. దానికి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. హాకింగ్ మృతితో శాస్త్ర సాంకేతిక సమాజం తీవ్ర విషాదంలో మునిగింది.