విజయవాడ: ఏపీ ప్రభుత్వానికి కేంద్రం నుంచి మరో తిరస్కారం ఎదురైంది. ఏపీకి ఇంటలిజెన్స్ ఛీఫ్‌గా తెచ్చుకోవాలనుకున్న సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర కేడర్ మార్పునకు కేంద్రం నో అని చెప్పింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో అనధికారికంగా విధులు నిర్వర్తిస్తున్న ఐజీ స్టీఫెన్ కేంద్రం తాజా నిర్ణయం ప్రకారం తెలంగాణకు తిరిగి వచ్చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఒక డైనమిక్ ఐపీఎస్ అధికారిని ఇంటలిజెన్స్ అధిపతిగా తీసుకురావాలని యోచించి కొన్ని పేర్లు పరిశీలించారు. హైదరాబాద్ రేంజ్ ఐజీగా ఉన్న స్టీఫెన్ అయితే తమకు అన్నివిధాలుగా శ్రేష్ఠమని భావించి ఆయన్ని ఆంధ్రప్రదేశ్‌కు పంపాలని కోరారు. దీనికి తెలంగాణ సీఎం కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలూ పరస్పరం అంగీకారం తెలుపుతూ యూపీఎస్సీకి లేఖరాశాయి.
స్టీఫెన్ రవీంద్రకు కేంద్రం నో
దీంతో.. స్టీఫెన్ రవీంద్రను ఏపీకి కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు రావడం కేవలం లాంఛనమేనని అంతా భావించారు. 15 రోజుల్లోనే దీనికి ఆమోదం వస్తుందని అప్పట్లో అందరూ అనుకున్నారు. ఇప్పుడు మూడు నెలలు గడిచాక కేంద్రం స్టీఫెన్ కేడర్ మార్పు కుదరదని తేల్చింది. మే చివరి వారంలో తెలంగాణ సీఎం ఆమోదం వెలువడగానే.. స్టీఫెన్ రవీంద్ర సెలవులపై వెళ్లారు. ఏపీలో అనధికారికంగా ఇంటెలిజెన్స్ చీఫ్‌గా కొనసాగుతున్నారు. ఎక్కడా ఫైళ్లపైన సంతకాలు చేయకపోయినా ఏపీలో నిఘా విభాగాధిపతిగా వ్యవహారాలన్నీఆయనే చూస్తున్నారు. ఇప్పుడు కేంద్రం తిరస్కారంతో ఏపీ ప్రభుత్వం మరో అధికారిని నిఘా విభాగం కోసం వెతుక్కునే పరిస్థితి. మరి దీనిపై జగన్ కేంద్ర మంత్రి అమిత్‌షాతో మాట్లాడతారా.. లేక సర్ది చెప్పుకుని మరో అధికారి కోసం వెతుక్కుంటారా.. చూడాలి.
ఇలావుంటే, స్టీఫెన్ మాదిరి ఏపీకి వెళ్లాలనుకుంటున్న మరికొందరు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పునరాలోచనలో పడ్డారు. రెండు రాష్ట్రాల పరస్పర అంగీకారం ఉన్న స్టీఫెన్ విషయంలోనే కేంద్రం నుంచి ఆమోదం లభించకపోతే ఇక తమ పరిస్థితి ఏమిటని చర్చించుకుంటున్నారు.