తీసుకున్న అప్పులు చెల్లించలేక తన ఇంటిని అమ్మెద్దామని రెడీ అయ్యాడో వ్యక్తి. అనుకున్నట్టుగా మంచి ధరకు బేరం కూడా కుదుర్చుకున్నాడు. మరో రెండు గంటల్లో ఆ ఇంటి అమ్మకం పూర్తవుతుందనగా ఆ వ్యక్తికి బంపర్ లాటరీ తాకింది. వేయ్యో… లక్షో కాదు ఏకంగా రూ. కోటి లాటరీ తగిలింది. దీంతో అతని స్టార్ మారిపోయింది. వివరాల్లోకి వెళితే…
కేరళలో కొజికోడ్ కు చెందిన మొహమ్మద్ బవా (50) పెయింటర్ గా పని చేస్తున్నాడు. బవాకు భార్య, ఓ కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.ఇద్దరు కుమార్తెల వివాహం, ఇటీవల ఇల్లు కట్టుకోవడం వంటి కారణాల వల్ల అప్పుల పాలయ్యాడు. సుమారు 40 లక్షల వరకు అప్పులు చేశాడు.
ఆ తర్వాత తన కుమారుడు నిజాముద్దీన్ ను ఖతార్ కు పంపించేందుకు మరి కొంత అప్పు చేశాడు. దీంతో అప్పల భారం పెరిగిపోయింది. అప్పుల వల్ల ఒత్తిడితో ఇంటిని అమ్మి వేయాలని నిర్ణయించుకున్నాడు.ఇంటిని రూ. 40లక్షలకు కొనేందుకు ఓ వ్యక్తి ముందుకు వచ్చాడు. ఒప్పందం ప్రకారం సోమవారం ఉదయం అతనికి సదరు వ్యక్తి అడ్వాన్స్ ఇవ్వాల్సి వుంది. మరో రెండు గంటలు ఉందనగా అతని బంపర్ లాటరీ తాకింది.
హోసంగడిలోని ఓ ఏజెన్సీ దగ్గర ఆయన లాటరీ కొనుగోలు చేశారు. లాటరీపై రూ. కోటి రూపాయలు గెలిచినట్టు తెలిసింది. దీంతో బవా ఉబ్బితబ్బిబై పోయాడు. దీంతో ఇంటికి అడ్వాన్స్ చెల్లించేందుకు వ్యక్తి రాగా … తాను ఇంటిని అమ్మడం లేదంటూ బవా చెప్పేశాడు. లాటరీ ద్వారా వచ్చే డబ్బులో పన్నులు పోను వచ్చిన మొత్తంతో అప్పులు కట్టేస్తానని, మిగిలిన దానితో ప్రశాంతంగా జీవనం గడుపుతానని చెప్పాడు.