దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు 16 నెలల కనిష్టానికి పడిపోయాయి. ఉక్రెయిన్ కు చెందిన ఐరోపాలోని అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రంపై రష్యా దాడి చేసింది. ఈ దాడులు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. దీంతో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం ధరలు పెరుగుతుండగా.. స్టాక్ మార్కెట్లు మాత్రం కుప్పకూలుతున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లకుపైగా పడిపోయింది. ప్రస్తుతం 1077 పాయింట్ల నష్టంతో.. 54,025 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 322 పాయింట్లు కోల్పోయి.. 16, 175 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 ప్యాక్ లో ఐటీసీ, టాటా స్టీల్ మినహా అన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. ఆటో, రియాల్టీ, బ్యాంకింగ్ షేర్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 1-2 శాతం మేర పడిపోయాయి.
యూపీఎల్, ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా స్టీల్ వంటి సంస్థలు రాణిస్తున్నాయి. ఏషియన్ పెయింట్స్, మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్, ఐచర్ మోటార్స్, హెచ్యూఎల్ డీలాపడ్డాయి. ఉక్రెయిన్- రష్యా యుద్ధ ప్రభావంతో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ ఆరంభంలోనే భారీ నష్టంతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 730 పాయింట్ల నష్టంతో.. 54,390 వద్ద కొనసాగుతోంది.జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 200 పాయింట్లకుపైగా కోల్పోయి.. 16,280 వద్ద ట్రేడవుతోంది.
మరోవైపు.. హిందాల్కో, టాటా స్టీల్, కోల్ ఇండియా, బీపీసీఎల్, ఎన్టీపీసీ వంటి సంస్థలు రాణిస్తున్నాయి. ఏషియన్ పెయింట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, విప్రో, బజాజ్ ఆటో డీలాపడ్డాయి.