అత్యంత వేగంగా ప్రయాణించే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్లపై వరుసగా రాళ్ల దాడులు జరుగుతున్నాయి. జనాలకు ఏమైంది. ఎందుకు ఈ ట్రైన్ల పై రాళ్లతో దాడికి దిగుతున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొన్న ట్రయల్ రన్ లో భాగంగా విశాఖకు వచ్చిన వందే భారత్ ట్రైన్ బోగీలపై కంచరపలెంలో రాళ్ల తో దాడి చేశారు.
రాళ్ల దాడిలో రెండు కోచ్ ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో ఆర్పీఎఫ్ పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. రామ్మూర్తి పంతులుపేట గేటు దగ్గర ఆడుతున్న ఆకతాయిలు ట్రైన్ పై రాళ్లు విసిరినట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా, బీహార్ లో కతిహార్ జిల్లాలోని బలరాంపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో మరో ఘటన జరిగింది. రైలు నంబర్ 22302 పై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేశారు.
ఈ ఘటనలో సి6 బోగీ విండో అద్దాలు దెబ్బతిన్నాయి. అయితే ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా గతేడాది డిసెంబర్ 30న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్ లోని హౌరా న్యూ జల్పాయిగురి మధ్య వందేభారత్ రైలును ప్రారంభించారు. ఆ తర్వాత నాలుగు రోజులకే రైలుపై రాళ్ల దాడి జరిగింది.
వందేభారత్ రైళ్లపై జరుగుతున్న వరుస రాళ్ల దాడులు అధికారులను కలవర పెడుతున్నాయి. వందేభారత్ రైలును పూర్తిగా ఇండియాలోనే తయారు చేస్తున్నారు. దీన్ని సెమీ హై స్పీడ్ ట్రైన్ గా పిలుస్తున్నారు. వందేభారత్ కు ప్రత్యేక ఇంజిన్ ఉండదు. ఇందులో ఆటోమేటిక్ డోర్లు, ఏసీ ఛైర్ కార్ వంటివి ఉంటాయి. తక్కువ విద్యుత్ ను వినియోగించుకునేలా వీటిని అభివృద్ధి చేస్తున్నారు. దేశంలో 400 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు గత కేంద్ర బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ ప్రకటించారు.