కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు నివాసంపై అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. హైదరాబాద్ అంబర్‌పేటలోని తన ఇంటి ముందు ఉన్న కారును ధ్వంసం చేశారు. అయితే.. ఈ దాడి జరిగిన సమయంలో వీహెచ్ ఇంట్లోనే ఉన్నట్టు తెలుస్తోంది.
మాజీ పీసీసీ అధ్యక్షుడిగా, మాజీ ఎంపీగా పని చేసిన తనకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు వీహెచ్. బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి తాను ముందుంటున్నానని.. అది సహించలేని కొందరు తనపై దాడులు చేపిస్తున్నారని ఆరోపించారు.
గతంలో తనకు బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు డీజీపీకి చెప్పినప్పటికీ.. ఇంత వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. తన ఇంటిపై రాళ్లు రువ్వి, కారును ధ్వంసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. సీసీ టీవీ ఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించే ప్రయత్నం విచారణ చేపట్టినట్టు వెల్లడించారు పోలీసులు.