కర్ణాటక రాష్ట్రంలోని హంపి వద్ద ఇటీవల ఓ ఆంధ్రా జంట ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ చేసింది గుర్తుంది కదా. అయితే ఆ సంఘటనపై వివాదం చెలరేగింది. వారు హంపిలోని విజయ విఠల ఆలయంలో ఉన్న రథ నిర్మాణంపై ఫొటోషూట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సదరు నిర్మాణం శిథిలమవుతున్నందున దాన్ని ఎవరూ టచ్ చేయకూడదని రూల్స్ ఉన్నాయి. కానీ వాటికి విరుద్ధంగా ఆ జంట వ్యవహరించడంతో విమర్శలు వచ్చాయి. అయితే ఇకపై అలాంటి విమర్శలకు తావు లేకుండా ఆ రథ నిర్మాణానికి ప్రత్యేక రక్షణ రింగ్‌ను ఏర్పాటు చేశారు.
హంపిలోని విజయ విఠల ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. అక్కడ రాతి రథం నిర్మాణం టూరిస్టుల వద్ద దెబ్బతింటోంది. అయితే ఇటీవల ఆంధ్రా జంట ఏకంగా దాని మీదకు ఎక్కి ఫొటోషూట్ చేయడం, వారి ఫొటోలు వైరల్ కావడంతో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) అధికారులపై విమర్శలు వచ్చాయి. సదరు జంటకు అక్కడికి ఎక్కేందుకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు ? అంటూ ప్రశ్నించారు. అయితే ఇకపై టూరిస్టులు దాని మీదకు ఎక్కకుండా, దాన్ని టచ్ చేయకుండా ఉండేందుకు గాను ఆ రథ నిర్మాణం చుట్టూ రక్షణ రింగ్‌ను ఏర్పాటు చేశారు.
టూరిస్టులు ఇకపై ఆ రథాన్ని ఏమాత్రం టచ్ చేయరాదు. దూరం నుంచే చూసి ఫొటోలు తీసుకునేది ఉంటే తీసుకుని వెళ్లిపోవాలి. ఈ సందర్భంగా హంపి ఏఎస్ఐ డిప్యూటీ సూపరింటెండెంట్ పి.కలిముత్తు మాట్లాడుతూ ఇటీవలి కాలంలో హంపి ఆలయంలో టూరిస్టులు నిర్మాణాలను ఎక్కువగా టచ్ చేస్తున్నారని, కొందరు మీదకు ఎక్కి ఫొటోలు దిగుతున్నారని, దీంతో ఆయా నిర్మాణాలు దెబ్బ తింటున్నాయని అన్నారు. అందుకనే టూరిస్టులు దూరం నుంచే వాటిని చూసేలా రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కాగా హంపిలో ఉన్న రథాన్ని పోలిన రథాలు దేశంలో ఇంకా పలు చోట్ల ఉన్నాయి. ఒడిశాలోని కోణార్క్ సూర్యదేవాలయంలో, తమిళనాడులోని మహాబలిపురంలో అలాంటి రాతి రథ నిర్మాణాలను చూడవచ్చు. కాగా హంపిలో ఉన్న ఆ నిర్మాణాన్ని క్రీస్తు శకం 14 నుంచి 17 శతాబ్దం మధ్య కాలంలో విజయనగర సామ్రాజ్య రాజులు నిర్మించారు.