సికింద్రాబాద్-వైజాగ్ మధ్య ప్రారంభం కానున్న వందే భారత్ రైలుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. చెన్నై నుంచి బుధవారం రాత్రి మెయింటెనెన్స్ చెకప్ కోసం ఈ రైలు విశాఖ చేరుకుంది. అయితే కంచరపాలెం వద్ద దీనిపై రాళ్లు విసరడంతో ఓ కోచ్ గ్లాస్ కిటికీ అద్దాలు పగిలాయి. మరో కిటికీ అద్దాలు పాక్షికంగా పగుళ్లు విఛ్చాయి.
దీంతో విశాఖ పోలీసులు, రైల్వే రక్షక దళం దర్యాప్తు ప్రారంభించారు. బహుశా సమీప ప్రాంతాల్లో ఆడుకుంటున్న పిల్లలు ఆకతాయితనంగా రాళ్లు విసిరి ఉండవచ్చునని భావిస్తున్నారు.
సీసీటీవీ ఫుటేజీని దర్యాప్తు బృందం పరిశీలిస్తోంది. ఇదే సమయంలో ముగ్గురు యువకుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో సెక్యూరిటీని మరింతగా పెంచారు.
ఈ నెల 15 న ప్రధాని మోడీ ఈ రైలును వర్చ్యువల్ గా ప్రారంభించవలసి ఉంది. ఇటీవలే బెంగాల్ లో కూడా న్యూ జల్పాయ్ గురి వద్ద వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై కొందరు రాళ్లు విసిరారు. ఆ ఘటనలోనూ ఓ బోగీ డోర్ దెబ్బ తినగా రెండో బోగీల కిటికీల అద్దాలు పగిలాయి.