కేంద్ర సహాయ మంత్రి నిశిత్ ప్రమాణిక్ కు సొంత నియోజక వర్గంలో చేదు అనుభవం ఎదురైంది. పశ్చిమ బెంగాల్ లోని కుచ్ బిహార్‌లో ఆయన కాన్వాయ్ పై రాళ్లు రువ్వారు. నియోజకవర్గంలోని బీజేపీ కార్యాలయానికి వెళుతుండగా ఆయనపై దుండగులు రాళ్ల దాడి చేశారు.
పోలీసులు రంగంలోకి గుంపును చదరగొట్టేందుకు ప్రయత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇదే సమయంలో బీజేపీ నేతలు ఆగ్రహంతో కర్రలు పట్టుకుని ప్రత్యర్థిపై దాడి చేసేందుకు వెళుతుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు.
టీఎంసీ నేతలే ఈ దాడి చేశారని మంత్రి నిశిత్ ప్రమాణిక్ ఆరోపించారు. రాష్ట్రంలో ఓ మంత్రికే రక్షణ లేదంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. బెంగాల్‌లో ప్రజాస్వామ్యం పరిస్థితి ఏంటో ఈ ఘటన ద్వారా తెలిసిపోయిందని ఆయన విమర్శించారు.
నిశీత్ ప్రమాణిక్ కుచ్ బిహార్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పని చేస్తున్నారు. సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) కేంద్ర హోం శాఖ పరిధిలో ఉంటుంది. రాష్ట్రంలో ఇటీవల బీఎస్ఎస్ కాల్పుల్లో గిరిజనుడు ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి ప్రమాణిక్‌పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో దాడి జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.