అదేం విచిత్రమో వందే భారత్ రైళ్లను కేంద్రం ప్రారంభించినప్పటినుంచీ దేశంలో ఏదో ఒక చోట వాటిపై రాళ్ల దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ ..ముర్షీదాబాద్ జిల్లా లోని ఫరక్కా వద్ద శనివారం సాయంత్రం హౌరా-న్యూ జల్పాయ్ గురి వందే భారత్ రైలుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఈ రైలు బోగీ అద్దాలు ధ్వంసమయ్యాయి.
దీనిపై విచారణకు ఆదేశించినట్టు ఈస్టర్న్ రైల్వే అధికారి కౌశిక్ మిత్రా తెలిపారు. గత జనవరిలో కూడా ఇదే రైలుపై రాళ్ల దాడి జరిగింది. మాల్దాలోను, ఆ తరువాత మరుసటిరోజే కిషన్ గంజ్ లోను జరిగిన దాడుల్లో రెండు కోచ్ లు దెబ్బ తిన్నాయని ఆయన చెప్పారు.
గత నెలలో సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ రైలుపై మహబూబాబాద్ జిల్లాలోను, అంతకుముందు విశాఖ జిల్లా కంచరపాలెం లోను ఇలాంటి ఘటనలు జరిగాయి.
ఈ రైలు విండో గ్లాసు అద్దాలు పగిలిపోయాయి. ఫిబ్రవరి 23 న మైసూరు-చెన్నై ఎక్స్ ప్రెస్ పై జరిగిన రాళ్ల దాడిలో రెండు బోగీలు దెబ్బతిన్నాయి. ఇలాంటి ఘటనలకు పాల్పడిన దుండగులను సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించినప్పటికీ.. ఎవరినీ పోలీసులు అరెస్టు చేయలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.