ఉక్రెయిన్ సరిహద్దులకు చేరుకుంటున్న భారతీయులపై ఆ దేశ పోలీసులు దాడులకు దిగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. పోలాండ్ సరిహద్దులకు చేరుకుంటున్న తమను పోలీసులు అడ్డుకుంటున్నారని, దారుణంగా కొడుతున్నారని భారతీయ విద్యార్థులు చెబుతున్నారు.
వీటికి సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఇప్పుడు ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోల్లో ఓ విద్యార్థిని ఉక్రెయిన్ పోలీసు ఒకరు కాళుతో తంతున్నట్టు కనిపిస్తోంది.
మరో వీడియోలో ఉక్రెయిన్ పోలీసులు గాల్లోకి కాల్పులు జరుపుతున్నట్టు, విద్యార్థులు ఉక్రెయిన్ లోకి వెళ్లి పోవాలని బెదిరిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
‘ ఇక్కడ పరిస్థితులు రోజు రోజుకూ క్షీణిస్తున్నాయి. ఇప్పుడు జరుగుతున్నదేమిటంటే వారు మమల్ని టార్చర్ చేస్తున్నారు. సరిహద్దులను దాటి పోలాండ్ కు వెళ్లేందుకు వారు మమ్మల్ని అనుమతించడం లేదు. విద్యార్థినులను సైతం వారు వేధిస్తున్నారు. జుట్టు పట్టుకుని లాగి ఇనుప రాడ్లతో కొడుతున్నారు. కొంత మంది విద్యార్థులకు కాళ్లు, చేతులు విరిగాయి” అని మాన్సీ చౌదరీ అనే విద్యార్థిని తెలిపింది.
‘ భారత రాయబార కార్యాలయ సిబ్బంది మాకు ఆహారం, షెల్టర్ ఇచ్చి సహాయం చేస్తున్నారు. కానీ సరిహద్దులు దాటేందుకు ఇక్కడి పోలీసులు అనుమతించడం లేదు. ఎవరైనా సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తే వారిపై ఇనుప రాడ్లతో పోలీసులు దాడి చేస్తున్నారు”అని చౌదరి అనే వ్యక్తి తెలిపారు.