యవుసం దండగ కాదు.. పండగ చేస్తానని సీఎం కేసీఆర్ అప్పట్లో మాయ ముచ్చట చెప్పిండు. దాన్ని కప్పిపుచ్చటానికి ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రకటించిండు. రైతు బంధు.. బీమాలను తెరపైకి తీసుకొచ్చి అందరిని ఆశ్ఛర్యానికి గురి చేసిండు. వందల కోట్లరూపాయలు ఖర్చు పెట్టి రైతుల యవుసానికి ఉపయోగపడుతదని కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నిర్మించిండు. కానీ ఏడేండ్లు గడవకముందే అంతా తారుమారు అయింది. యవుసం పండగ ఏమో కానీ దండగ అయ్యేటట్టుందని రైతులు దుమ్మెత్తి పోస్తున్నరు కేసీఆర్ సర్కారు మీద. ఒక్క తెలంగాణ రాష్ట్రంలనే ఇంత దరిద్రంగా వరి పంట దిగజారడానికి రాష్ట్ర ప్రభుత్వం చేతకాని తనమే కారణం అని పలువురు అభిప్రాయపడుతున్నరు.
తెలంగాణల తొలుత 30 లక్షల ఎకరాలల్ల మాత్రమే వరిపంట సాగు జరిగేది. కానీ ఇప్పుడు ఏకంగా కోటీ 10 లక్షల ఎకరాల వరకు పెరిగింది. దీంతో అన్ని చోట్ల వరి ధాన్యం నిల్వలు విపరీతంగా పెరిగిపోయినయ్.. మిల్లులు గోదాంలల్ల వడ్ల బస్తాలు కిటకిటలాడుతున్నయ్.. కాలువలపొంటి నీళ్లు ఎక్కువ తక్కువ రావడంతోటే రైతులందరూ వరిపంటలు పండించటానికి మొగ్గుసూపిర్రు.. కానీ నీటి సరఫరా ఇచ్చేటప్పుడే నీళ్ల ఆధారంతోటి పండే వేరే పంటలను పండించేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుండేది.కానీ ఆ విషయంల ప్రభుత్వం విఫలమైందని అనుకుంటున్నరు రైతులు.