వ్యాపారం అంటే నమ్మకంతో చేయాలి. మోసంతో కాదు. కానీ.. దీన్ని ఎక్కువశాతం ఎవరూ ఫాలో అవ్వరు. వినియోగదారుడి నుంచి దోపిడీనే లక్ష్యంగా వ్యాపారం సాగిస్తున్నారు చాలామంది. క్యారీ బ్యాగ్ నుంచి ఎమ్మార్పీ రేట్ల దాకా ఇది కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వినియోగదారుల ఫోరం తాజాగా ఇచ్చిన ఆదేశాలు జరుగుతున్న మోసాలకు చెంపపెట్టులా ఉంది.
వివరాల్లోకి వెళ్తే.. విశాఖకు చెందిన న్యాయవాది రామారావు 2019 జులై 14న ఓ రిటైలర్ షోరూంలో రూ.628తో దుస్తులు కొనుగోలు చేశాడు. బిల్లింగ్ చేసే సమయంలో క్యారీ బ్యాగ్ కు రూ.12 ఛార్జ్ చేశారు. దానికి రామారావు నిరాకరించడంతో క్యాషియర్ తో వాగ్వాదం నడిచి చివరకు చెల్లించాడు.
దీనిపై మేనేజర్ ను సంప్రదించాడు రామారావు. క్యారీ బ్యాగ్ పై ఛార్జీలు విధించడం చట్ట విరుద్ధమని చెప్పినా వినిపించుకోలేదు. పైగా.. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీంతో తనను మానసిక హింసకు గురి చేశారని నష్టపరిహారం కోరుతూ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు రామారావు.
విచారణ జరిపిన వినియోగదారుల ఫోరం రిటైలర్ కు భారీ షాకిచ్చింది. కస్టమర్ ను మానసికంగా హింసించారని రూ.21 వేల ఫైన్ విధించింది. అలాగే లీగల్ ఖర్చులకు రూ.1500, క్యారీ బ్యాగ్ పై విధించిన రూ.12 కూడా చెల్లించాలని ఆదేశించింది. కమిషన్ సభ్యులు రహిమున్సీసా బేగం, ప్రిసైడింగ్ మెంబర్ క్రిష్ణమూర్తి ఈ ఆదేశాలు ఇచ్చారు.