నడిచే విశ్వవిద్యాలయం అనే మాటను వినే ఉంటారు. అది రోమన్ సైనీకి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఆయన డాక్టర్, మాజీ ఐఏఎస్ అధికారి, సక్సెస్ ఫుల్ వ్యవస్థాపకుడు. భారతదేశంలోనే సివిల్ సర్వీసులలో ఎంపికైన అతి పిన్న వయస్కుడైన రోమన్ అక్కడి నుంచి లక్షలాది మంది యూపిఎస్సి ఔత్సాహికులకు సహాయపడే వ్యక్తిగా, రూ.14,000 కోట్లకు పైగా విలువైన కంపెనీ స్థాపకుడుగా ఎలా ఎదిగాడు? అనే స్ఫూర్తిదాయకమైన కథను తెలుసుకుందాం.
16 సంవత్సరాల వయస్సులో ఎయిమ్స్ అడ్మిషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అతి పిన్న వయస్కుడిగా సైనీ గుర్తింపు పొందాడు. తన ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత రోమన్ సైనీ ఎయిమ్స్ లోని నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్మెంట్ సెంటర్ (NDDTC) లో పనిచేశాడు. డాక్టర్‌గా ఆయన పని 6 నెలలు మాత్రమే కొనసాగింది. ఆ తరువాత ఆయనకు ఐఏఎస్ అవ్వాలన్న కోరిక పుట్టింది. అంతే అనుకున్నదే తడవుగా కష్టపడి 22 సంవత్సరాల వయస్సులో రోమన్ సైనీ యుపిఎస్‌సి సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఇది భారతదేశంలో అత్యంత క్లిష్టమైన పరీక్షలలో ఒకటి.
దేశానికి సేవ చేయాలని తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓసారి వెల్లడించాడు. రోమన్ 22 సంవత్సరాల వయస్సులో అతి పిన్న వయస్కుడైన ఐఏఎస్ అధికారులలో ఒకరు. ఈయన మధ్యప్రదేశ్‌కు కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఉద్యోగం కూడా అంతగా తృప్తిని ఇవ్వకపోవడంతో ఎంతోమంది కలగనే ఉద్యోగానికి స్వస్తి పలికాడు.తన స్నేహితుడు గౌరవ్ ముంజల్ తో కలిసి యూపిఎస్సి కోసం కష్టపడే ట్రైనీలకు లక్షల రూపాయలు కట్టే పని లేకుండానే “Unacademy” పేరుతోఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ వేదికను అందించాడు.
2010 లో గౌరవ్ ముంజల్ సృష్టించిన యూట్యూబ్ ఛానెల్ Unacademy ఆరేళ్ల కిందట 18,000 మంది విద్యావేత్తల నెట్‌వర్క్‌తో భారతదేశంలోని అతిపెద్ద విద్యా సాంకేతిక ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ కంపెనీ విలువ 2 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 14,830 కోట్లు). ప్లాట్‌ఫామ్ కు 50 మిలియన్లకు పైగా యూజర్లు ఉన్నారు.
Advertisements
నేర్చుకోవడం విజయానికి మొదటి మెట్టు అని రోమన్ సైనీ అభిప్రాయపడ్డారు. ఒక ఛాలెంజ్ తీసుకునే ముందు మీరు దాని కోసం సిద్ధం కావాలి. ప్రజలు పుట్టుకతో మేధావులు కారు. ప్రతి ఒక్కరూ తమకు తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడానికి జ్ఞానం, ప్రతిభ, పట్టుదల అవసరం.