నాలుగు శుక్రవారాలు వెళ్లిపోయాయి. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజ్యాంగాన్ని మాత్రం గౌరవించడు. కోర్టులో హాజరుకావాల్సిన పెద్దమనిషి.. తాను బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నానని.. బాధ్యతలో భాగంగా పనులు అడ్డం వస్తున్నాయని.. రాలేకపోతున్నానని.. ప్రతిసారీ అబ్సెంట్ పిటిషన్ వేయడం.. కోర్టు హియరింగ్ వాయిదా వేయటం జరుగుతూనే ఉంది. అందరూ చూస్తూనే ఉన్నారు.
ముందు అసలు హాజరుకాకుండానే ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నించాడు. కాని అది కుదరలేదు. కాని ఇప్పుడు అబ్సెంట్ పిటిషన్లతో కాలం వెళ్లబుచ్చుతున్నాడు. పైగా అపాయింట్ మెంట్లు లేకుండానే రమ్మన్నారంటూ ఢిల్లీ వెళ్లి మకాం వేసి మరీ.. కోర్టుకు హాజరు కాలేదు. సన్నిహితుడు మరణించగానే హుటాహుటిన అనంతపురం వెళ్లిన సీఎంకు.. కోర్టుకు హాజరు కావడం కుదరడం లేదట.
అసలు విషయం ఏంటంటే.. ముఖ్యమంత్రి అయ్యాక.. ఇంత ఘన విజయం అందుకున్నాక..ఇంతమంది ప్రజల మద్దతు పొందాక.. కోర్టుకు ఎందుకు హాజరు కావాలి? ప్రజాకోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చాక.. ఈ కోర్టుకు వెళ్లేదేంటి? అనేదే ముఖ్యమంత్రి అంతరంగంలా కనపడుతోంది. అందుకే సీఎం అయ్యాక ఒక్కసారి కూడా కోర్టు మెట్లు ఎక్కకుండా మేనేజ్ చేసుకొస్తున్నారు.
ఆయన అభిమానులు కూడా వాదించేది ఒక్కటే.. ఇందులో ఇల్లీగల్ ఏమీ లేదు. ఈ కేసు నిలబడదు. అయినా ఎంతమంది రాజకీయ నాయకులు ఇలా డబ్బు సంపాదించలేదు.. ఇందులో తప్పేంటి అంటూ దబాయిస్తున్నారు.
చిన్నా చితక కమిషన్లు కాదు.. ఇలా తీసుకోవచ్చు అంటూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిరూపించారు. ఎకరాలకు ఎకరాలు భూములు.. కోట్లకు కోట్లు డబ్బులు.. వీటన్నిటిని లీగలైజ్ చేయడానికి సూట్ కేసు కంపెనీలు.. తమ స్వంత సంస్థల్లో పెట్టుబడులు ఇలా ఒక అవినీతి చక్రమే తిప్పారు. రాజకీయ వైరాలు లేకుంటే .. నిజంగానే ఈ కేసు ఇంత స్ట్రాంగ్ గా ఉండేది కాదేమో.. కాని అవినీతి జరిగిందన్నది వాస్తవమని సీబీఐ ఛార్జిషీట్లు చెబుతున్నాయి.
అవినీతి అలవాటేనని సర్దుకుపోతున్న జనం.. రాజకీయ నాయకత్వానికి అవినీతికి సంబంధం లేనట్లు భావిస్తున్న ఓటర్లు.. తమ తీర్పులో అవినీతిని పట్టించుకోవడం లేదేమో అనిపిస్తుంది. కాని చట్టం చట్టమే కదా. పైగా కేంద్రంలో ఉన్నవారు ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని.. అఖండ భారత్ సాధించే పనిలో ఉన్నారు. అందుకే ఇప్పుడు పరిస్ధితి జగన్మోహన్ రెడ్డికి చాలా ఇబ్బందికరంగా మారింది. లీగల్ గా ఫైట్ చేయాల్సిన మనిషి.. ఇప్పుడు తప్పించుకోవడానికి దారులు వెతుక్కుంటూ.. రాష్ట్రం పరువును కోర్టులో కలిపేస్తున్నారు.