తెలుగు తెరకు ఆణిముత్యాల హారం కట్టి దివికేగిన దిగ్గజ దర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్. శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, స్వాతికిరణం వంటి పలు చిత్రాలతో వినోదాన్ని పంచుతూనే విలువలు నేర్పిన గొప్ప దర్శకుడాయన.
సామాజిక సంస్కరణ, కళోద్ధరణ లాంటి ఉన్నతమైన ఆశయాలు తలకెత్తుకుని తన సినిమాల ద్వారా మాన్యుల నుండి సామాన్యులవరకూ చెప్పే ప్రయత్నం చేసాడు.తెలుగు చిత్ర పరిశ్రమలో సుమారు 50 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన విశ్వనాథ్ గారు ఇటీవల మరణించి ఇండస్ట్రీకి తీరని లోటుని మిగిల్చారు.
తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా దాదాపు తొమ్మిది బాలీవుడ్ సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు.అదేవిధంగా బుల్లితెర సీరియల్స్ కి కూడా దర్శకత్వం వహించారు.కాగా ఈయన దర్శకత్వంలో రూపొందిన మొట్టమొదటి చిత్రం ఆత్మగౌరవం.
గతంలో ఈయన దర్శకత్వం వహిస్తున్న సినిమాకు సంబంధించిన స్టిల్స్ కనుక పరిశీలిస్తే ప్రతిచోటా ఖాకీ చొక్కాతో కనిపిస్తారు. ఇలా ఈయన ఖాకీ చొక్కాతో షూటింగ్ లొకేషన్లో పాల్గొనడానికి గల కారణం ఏంటి అని ఓ సందర్భంలో విశ్వనాథ్ గారిని ప్రశ్నించడంతో ఆయన సమాధానం చెబుతూ….
దర్శకత్వం అనేది ఓ బాధ్యత. ఓ విధి. ఓ ఉద్యోగం లాంటిది. అందుకే దాన్ని విధిగా ఆచరించాలనే ఉద్దేశంతోనే అలా యూనిఫామ్ లో కనిపిస్తానని తెలిపారు. ఇలా సినిమాల పట్ల ఇంత డెడికేషన్ చూపించేవారు కనుకనే ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రతీ సినిమా కళాఖండంగా నిలిచింది.