సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులో నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జీ ఏడేండ్ల జైలు జీవితం తర్వాత విడుదలయ్యారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో బయటకు వచ్చిన ఆమె తాజాగా తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా తన జైలు జీవితం గురించి ఆమె వివరించారు.
ముంబైలోని బైకుల్లా జైలు నుంచి బయటకు వచ్చిన ఆమె… ‘ నేను ఇప్పుడు ఇంటికి వెళుతున్నాను. నన్ను ఇబ్బందులకు గురి చేసిన వారందరినీ నేను క్షమించాను. నాకు ఎవరిపై పగ, ద్వేషం లేదు. జైలు నాకు ఎన్నో పాఠాలు నేర్పింది’ అని అన్నారు.
‘నన్ను అరెస్టు చేసిన తర్వాత, నేను తీవ్ర నిరాశకు గురయ్యాను. నాపై మీడియా ప్రశ్నల వర్షం కురిపించింది. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నందున నేను ఎవరికీ వివరణ ఇవ్వలేకపోయాను. నేను తప్పు చేశానని అందరూ ముందే నిర్ణయించేశారు. నా బావోద్వేగాలను పట్టించుకోకుండా ట్రోల్స్ చేశారు. నా కాన్ఫిడెన్స్ లెవల్స్ బాగా పడిపోయాయి’ అని తెలిపారు.
ప్రజలు ఏమి చేయాలో వారు అదే చేస్తారని తాను గ్రహించానని తెలిపారు. అయితే పాజిటివ్ గా ఉండి సవాళ్లను ఎదుర్కోవాలని తాను భావించినట్టు చెప్పారు. అలా చేయడానికి ముందుగా ప్రజలను క్షమించాలని, ఈ విషయంలో నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని అనుకున్నట్టు వివరించారు.
‘ఇప్పుడు నేను బయటకు వచ్చాను, రేపు ఎలా ఉంటుందో నాకు తెలియదు కాబట్టి నేను చేయాలనుకున్నదంతా చేయాలనుకుంటున్నాను. నేను కూడా పాజిటివ్ దృక్పథాన్ని కలిగి ఉన్నాను’అని అన్నారు. జైలు నుంచి బయటకు వచ్చగా కొత్తగా అనిపిస్తోందన్నారు. ఆరేండ్లుగా నేలపై పడుకున్న తర్వాత మంచం మీద పడుకోవడం వింత అనుభూతిని ఇచ్చిందన్నారు.