ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో అనేక ఆచారాలు ఉంటాయి. ఏ ఆచారాన్ని ప్రజలు పాటించినా తమ పూర్వీకుల కాలం నుంచి అనుసరిస్తున్నారనో లేదా ఆ ఆచారాన్నిపాటిస్తే అంతా శుభమే కలుగుతుందనో.. నమ్ముతారు. అందుకనే ఒక్కో చోట మనకు భిన్న రకాల ఆచారాలను పాటించే ప్రజలు కనిపిస్తుంటారు. ఇక ఇటలీలోనూ ఈ తరహా జనాలను మనం చూడవచ్చు. ఎక్కడెక్కడంటే..
గలెరియా విటోరియో ఎమానుయెలె, మిలన్
ఇటలీలోని మిలన్ లో గలెరియా విటోరియో మాల్ అత్యంత పురాతనమైన మాల్‌గా ప్రసిద్ధి గాంచింది. దాన్ని చూసేందుకు ఎంతో మంది టూరిస్టులు నిత్యం ఇటలీకి వెళ్తుంటారు. అయితే అక్కడ మొజాయిక్ టైల్స్‌తో ఒక ఎద్దు బొమ్మను నేలపై ఏర్పాటు చేశారు. పాదాలతో ఆ ఎద్దు వృషణాలపై నలిపినట్లు మూడు సార్లు చేయాలి. దీంతో అదృష్టం కలసి వస్తుందని అక్కడి వారు నమ్ముతారు.
కాసా డి గియులెట్టా, వెరోనా
ఈ నిర్మాణంలోని ఆవరణలో జూలియట్‌కు చెందిన విగ్రహం ఉంటుంది. విగ్రహానికి ఉన్న కుడి స్థనాన్ని పట్టుకుంటే లక్ కలసి వస్తుందని, అదే విగ్రహానికి చెందిన రెండు స్థనాలను పట్టుకుంటే డబుల్ లక్ వస్తుందని అక్కడి వారు నమ్ముతారు. దీంతో అక్కడికి వచ్చే టూరిస్టులు కూడా అదే పనిచేస్తుంటారు. పనిలో పనిగా ఆ పనిచేస్తూ వారు ఫొటోలు కూడా దిగుతుంటారు.
పార్సిల్లినో (ది బోర్), ఫ్లోరెన్స్
ఈ ప్రాంతంలో ఒక అడవి పంది విగ్రహం ఉంటుంది. దాని నోటి నుంచి నీరు వస్తుంటుంది. నోట్లో ఒక కాయిన్ ను కింద పడేలా పెట్టాలి. దీంతో కాయిన్ కింద పడుతుంది. ఇలా చేయడం వల్ల లక్ కలసి వస్తుందని నమ్ముతారు.
ట్రెవి ఫౌంటెయిన్ ఇన్ రోమ్
ఈ ఫౌంటెయిన్‌కు వెన్ను చూపిస్తూ నిలబడి భుజం మీదుగా ఒక నాణేన్ని వెనక్కి వేయాలి. నాణెం ఫౌంటెయిన్ చుట్టూ ఉండే నీటిలో పడేలా వెనక్కి విసరాలి. దీంతో రోమ్‌కు మళ్లీ తిరిగి రావాలని కోరుకుంటారు. మళ్లీ రోమ్‌ను చూసేందుకు రావాలని ఆశిస్తారు.