టీవీ నటి తునీషా శర్మను హత్య చేశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయంటున్నారు ముంబైలోని వాసాయ్ స్థానికులు. ఈ నెల 24 న ఆమె తన టీవీ షో సెట్లోనే ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ రోజున సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో సుమారు ముగ్గురు, నలుగురు యువకులు ఆమెను తమ ఆసుపత్రికి తీసుకువచ్చారని, వారిలో ఆమె బాయ్ ఫ్రెండ్ అని చెబుతున్న షీజాన్ ఖాన్ కూడా ఉన్నాడని వాసాయ్ ఆసుపత్రి డాక్టర్ హోనీ మిట్టల్ తెలిపారు.
తునీషాను ఎలాగైనా బతికించాలని అతడు పదేపదే కోరాడని, చాలాసేపు విలపించాడని ఆయన చెప్పారు. ఆ సమయంలో తునీషా శరీరం చల్లగా ఉందని, ఈసీజీ పరీక్ష నిర్వహించగా ఫ్లాట్ లైన్ చూపిందని వెల్లడించారు. దాంతో ఆమె మరణించిందని తాము నిర్ధారించామన్నారు. అయితే ఆమె మెడపై నులిమినట్టుగా కూడా తాము గమనించినట్టు మిట్టల్ పేర్కొన్నారు.
బహుశా ఆమె ఉరి వేసుకున్న కారణంగా ఇవి కనబడ్డాయా అన్న విషయాన్నీ ఆయన స్పష్టం చేయలేదు. ఏది ఏమైనా పోలీసులకు తాము కనుగొన్న అంశాలను చెప్పినట్టు ఆయన తెలిపారు. తమ కుమార్తె మృతికి షీజాన్ ఖానే కారణమని తునీషా తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఇదివరకే ఆరోపించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించాడని ఆమె దుయ్యబట్టారు. పోలీసుల అభ్యర్థన మేరకు వాసాయ్ కోర్టు.. ఖాన్ కస్టడీని ఈ నెల 30 వరకు పొడిగించింది.
ఇతగాడు మరో అమ్మాయితో కూడా వాట్సాప్ ద్వారా మాట్లాడినట్టు తెలిసిందని, ఆ తరువాత చాటింగ్స్ ని డిలీట్ చేశాడని పోలీసులు తెలిపారు. ఇతని మొబైల్ నుంచి 250 పేజీల చాట్స్ కనుగొన్నామని, వీటిని స్టడీ చేయాల్సి ఉందని వారు చెప్పారు. డిలీట్ చేసిన మెసేజులనన్నిటినీ రిట్రీవ్ చేయాలని వాట్సాప్ కు పోలీసులు లేఖ రాశారు. తన 13 వ యేటి నుంచే తునీషా టీవీ సీరియల్స్ లోను, కొన్ని చిత్రాల్లోనూ , యాడ్స్ లోను నటిస్తూ వచ్చిందని, ముంబైలో సుమారు 15 కోట్ల ఆస్తిని సంపాదించిందని తెలుస్తోంది. ఇందులో ఓ ఫ్లాట్ కూడా ఉంది. ఈ ఆస్తులు ఆమె తల్లికి దక్కుతాయని భావిస్తున్నారు.