రాజస్థాన్ సిరోహి జిల్లాలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో తల్లి పక్కనే నిద్రిస్తున్ననెల రోజుల పసికందును ఓ వీధి కుక్క ఎత్తుకెళ్లింది. అంతే కాదు అభంశుభం తెలియని ఆ పసిగుడ్డుని కొరికి చంపేసింది.
పోలీసుల సమాచారం ప్రకారం…మహేంద్ర మీనా అనే వ్యక్తి సిలికోసిస్ వ్యాధికి చికిత్స కోసం సిరోహి జిల్లా ఆస్పత్రిలోని టీబీ వార్డులో అడ్మిట్ అయ్యాడు. అతనికి అటెండెంట్‌గా ఉండటం కోసం మహేంద్ర మీనా భార్య రేఖ..చిన్నవాళ్లైన తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆస్పత్రికి వచ్చింది.
ఈ క్రమంలో ఆ రోజు రాత్రి కూడా ఎప్పటిలాగే తన ముగ్గురు పిల్లలను పక్కలో వేసుకుని రేఖ నిద్రలోకి జారుకుంది. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో రెండు వీధి కుక్కలు వార్డులోకి ప్రవేశించాయి. అందులో ఒక కుక్క రేఖ నెల రోజుల బిడ్డను నోట కరుచుకుని ఎత్తుకుపోయింది. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
అయితే, బిడ్డను కుక్క ఎత్తుకెళ్లిన కాసేపటికి మెలకువ వచ్చిన రేఖ తన బిడ్డ లేదని గుర్తించి ఆస్పత్రి సిబ్బంది దృష్టికి తీసుకెళ్లింది. దాంతో ఆ పసికందు కోసం అంతా గాలించగా ఆస్పత్రి ఆవరణలో విగతజీవిగా పడివుంది. కుక్క ఆ పసికందు శరీర భాగాలను చిధ్రం చేసింది.
దాంతో ఆస్పత్రి సిబ్బంది ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, ఆస్పత్రి సిబ్బందితో కలిసి పసికందు మృతదేహాన్ని ఖననం చేశారు. కాగా, తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఆస్పత్రి సిబ్బంది, పోలీసులు తన బిడ్డను ఖననం చేశారని మహేంద్ర మీనా ఆరోపించాడు.
తన భార్యతో తెల్లకాగితం మీద సంతకం తీసుకుని, తనకు చివరిచూపు కూడా చూపించకుండా అంత్యక్రియలు జరిపించారని విమర్శించాడు. అదేవిధంగా ఆస్పత్రిలో వీధి కుక్కలు యదేచ్ఛగా సంచరిస్తుంటే సెక్యూరిటీ గార్డులు, సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించాడు.