తెలంగాణ లో బాలుడి ప్రాణం తీసినప్పటి నుంచి గ్రామ సింహాల దాడులు భారీగా పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వారం వ్యవధిలో దాదాపు వందల సంఖ్యలో కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. రోజు ఇరు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో వీధికుక్కల దాడి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పసి పిల్లలు, యువకులే కాకుండా వృద్ధులపైకి కూడా దాడికి ఎగబడుతున్నాయి.
అయితే ఇన్నాళ్లు సాధారణ ప్రజలపై ప్రతాపం చూపించిన గ్రామ సింహాలు ఇప్పుడు రాజకీయ నాయకులపై దాడులు చేస్తున్నాయి. తెలంగాణలో ఎంపీపీ భర్తపై దాడికి పాల్పడగా.. ఏపీలో మాజీ మంత్రి కుమారుడిపై ఎగబడ్డాయి. నిర్మల్ జిల్లా బాసర మండలంలో కుక్క కాటు సంఘటనలు పెరిగాయి. ఐదు రోజుల వ్యవధిలో మూడు సంఘటనలు చోటుచేసుకున్నాయి.
తాజాగా బిద్రేల్లి గ్రామంలో శుక్రవారం ఎంపీపీ సునీత భర్త, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు విశ్వనాథ్ పటేల్ పై కుక్కదాడికి పాల్పడింది. దీంతో అతడి కాలికి తీవ్ర గాయమైంది. దీంతో ఆయన వెంటనే ఆస్పత్రిలో చేరిపోయాడు. గతంలో బాసర ట్రిపుల్ ఐటీలో ఇద్దరు విద్యార్థులపై కూడా దాడి చేశాయి.
ఇక ఏపీలోని నంద్యాల జిల్లా లో మాజీ మంత్రి కుమారుడిపై శునకాలు తమ ప్రతాపం చూపించాయి. పార్టీ ప్రచారంలో పాల్గొనగా అతడిపై దాడికి పాల్పడ్డాయి. ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా నంద్యాలలో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్ఎండీ ఫరూక్ కుమారుడు ఫిరోజ్ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం స్థానికంగా ప్రచారంలో ఉండగా ఫిరోజ్ పై కుక్క దాడి చేసింది.
అతడిని కరవడంతో వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకులు స్పందించారు. హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించారు. నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఇలా నాయకులపై గ్రామసింహాలు దాడులకు పాల్పడ్డాయి.