ఏపీ, తెలంగాణలో వీధి కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల హైదరాబాద్ లో వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతిచెందాడు. తాజాగా నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మరో వీధి కుక్కల దాడి ఘటన తెరపైకి వచ్చింది. మల్లాపూర్ గ్రీన్ హిల్స్ కాలనీలో ఆడుకుంటున్న బాలుడిపై వీధికుక్కలు దాడికి ప్రయత్నించాయి. అయితే బాలుడు చాకచక్యంగా వీధికుక్కల దాడి నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనలో బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి.
హైదరాబాద్ లో వీధి కుక్కల బెడద నుంచి విముక్తికి జీహెచ్ఎంసీ ప్రతిష్టమైన చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కుక్కల దాడి సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేయాలని అధికారులు మార్గదర్శకాలు జారీచేశారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ, జీహెచ్ఎంసీ సంయుక్తంగా కుక్కల బెడద నివారణకు మార్గదర్శకాలను జారీచేశారు.
రాష్ట్రంలో కుక్కల బెడదను తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. జీహెచ్ఎంసీ పరిధిలో జంతు పరిరక్షణకు అనేక చర్యలు చేపడుతున్నారు. నగరంలో జంతు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి, స్వచ్ఛంద సంస్థల సహకారంతో వాటిని నిర్వహిస్తున్నారు. ఇటీవల పెంపుడు జంతువుల క్రిమిటోరియాలను కూడా ఆరు జోన్లలో ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. అంతే కాకుండా.. కుక్కల బర్త్ కంట్రోల్ చేయడానికి, దాంతోపాటు రేబిస్ వ్యాధి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఇందులో భాగంగా 30 సర్కిళ్లలో 30 వాహనాలను ఏర్పాటు చేసి స్టెరిలైజేషన్ తో పాటు వ్యాక్సినేషన్ చర్యలు చేపడుతున్నారు. గతంలో కుక్కల గణన సందర్భంగా ఐదు లక్షల 75 వేల కుక్కలు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. అందులో 75 నుంచి 80 శాతం వరకు బర్త్ కంట్రోల్ చేశారు. జంతు పరిరక్షణకు జాతీయ యానిమల్ బోర్డ్, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.