రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా చాపకింద నీరులా విస్తరిస్తోందని అన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. బాగ్ లింగంపల్లిలోని అర్టీసీ కళ్యాణ మండపంలో డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై హైదరాబాద్ పోలీసు బృందం విసృత ప్రచారాన్ని మొదలు పెట్టింది. ఈ కార్యక్రమానికి ఆనంద్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.
వచ్చే 10 సంవత్సరాల్లో ప్రధానంగా రెండు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. ఒకటి ఎంప్లాయ్ మెంట్ అయితే.. రెండు మాదక ద్రవ్యాలు. పిల్లల పట్ల పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పట్టణాలతో పాటు.. గ్రామీణ ప్రాంతాలలో సైతం మాదకద్రవ్యాల అమ్మకాలు పెరిగాయన్నారు. అయితే.. స్మగ్లర్లు వీటిని అటవీ ప్రాంతాల నుండి రవాణా చేస్తున్నారని అన్నారు.
కోవిడ్ సమయంలో కొంత మంది విద్యార్థులు గంజాయికి అలవాటు పడ్డారని తెలిపారు. ఇంటర్ నేషనల్ స్కూల్ విద్యార్ధులను టార్గెట్ చేసుకొని స్కూల్ బయట డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నారని అన్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు.
వెయ్యి మంది పోలీసులతో నార్కోటిక్స్ ఎన్ఫోర్స్ మెంట్ వింగ్, నార్కోటిక్స్ ఎన్ఫోర్స్ మెంట్ ఇన్వెస్టిగేషన్ వింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మాదక ద్రవ్యాలు అమ్మినా.. కొన్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిస్తే విద్యార్ధులు అని కూడా చూడకుండా అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు.