కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధాలనాలను అవలంభిస్తుందంటూ కార్మిక సంఘాలు దేశవ్యాప్త నిరసనకు పూనుకున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక చట్టాల సవరణ, పెరుగుతున్న గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా 48 గంటల పాటు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు చెందిన కార్మిక సంఘాలు సోమవారం తెల్లవారుజాము నుంచే కొద్ది సమయం రోడ్లు, రహదారులను దిగ్భందించి భారత్ బంద్ ను పాటించాయి. రోడ్డు, రవాణా, విద్యుత్తు, బ్యాంకింగ్, బీమా తదితర రంగాలకు చెందిన సిబ్బంది ఈ బంద్ లో పాల్గొన్నారు.
ఈ సమ్మెలో రెండు రోజుల పాటు ఉద్ధృతంగా ఆందోళనలు చేపట్టాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగానే రోడ్లు, రహదారులను దిగ్భందించి నిరసనలు తెలిపాయి. ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు పెంచాలని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిలుపునిచ్చిన ఈ బంద్ కు 10 కేంద్ర కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. కాగా, పరిశ్రమలున్న రాష్ట్రాల నుంచి బంద్ కు విశేష స్పందన లభించింది. ప్రైవేటీకరణ, కార్మిక చట్టాల సవరణపై సింగరేణిలో కార్మికులు సమ్మెకు దిగారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా విధులు బహిష్కరించారు. దీంతో బొగ్గు గనులు నిర్మానుష్యంగా మారాయి. మరోవైపు తెలంగాణలో క్యాబ్ లు, ఆటోల సంఘాలు భారత్ బంద్ కు మద్దతు పలికాయి.
ఖైరతాబాద్ లోని రవాణా శాఖ కార్యాలయం ముందు యూనియన్ నేతలు, డ్రైవర్లతో ధర్నాకు దిగారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఇక ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వామపక్ష, కార్మిక సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి. ముద్దిలపాలెం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై వాహనాలను అడ్డుకున్నారు. బస్టాండ్ ల నుంచి బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నాయి కార్మిక సంఘాలు. స్టీల్ ప్లాంట్ వద్ద తెల్లవారుజాము నుంచే ఆందోళనలు చేపట్టారు. ‘ఎవడురా కొనేది.. ఎవడురా అమ్మేది’ అంటూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
దక్షిణాదిన ఒక్క కేరళలోనే బంద్ ప్రభావం అధికంగా కనిపించింది. రాష్ట్రవ్యాప్తంగా రవాణా సేవలు నిలిచిపోయాయి. సమ్మె నుండి అత్యవసర సేవలను కార్మిక సంఘాలు మినహాయించాయి. రైల్వే స్టేషన్స్, ఆస్పత్రులు వెళ్లే ప్రయాణికుల కోసం పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పశ్చిమ బెంగాల్ లోని పలు ప్రాంతాల్లో నిరసనలు కొనసాగాయి. పలువురు వామపక్ష కార్యకర్తలు కోల్ కతాలోని జాదవ్ పూర్, డుమ్ డుమ్, బారాసత్, బెల్గారియా, జోరునగర్, దోమ్ జూర్ ప్రాంతాల్లోని రైల్వే ట్రాక్ లపై బైఠాయించారు. గోల్ పార్క్, లేక్ టౌన్, బగౌతియాలతో పాటు పలు ప్రాంతాల్లో రహదారులను దిగ్భందించారు. ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరుకావాలని మమతా బెనర్జీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను, బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు 2021కి వ్యతిరేకంగా బ్యాంక్ యూనియన్లు నిరసన తెలిపాయి. తమిళనాడు సహా అన్ని రాష్ట్రాల్లోనూ సమ్మె కొనసాగింది. సంఘటిత, అసంఘటిత రంగాల్లో కలిపి నేడు నిర్వహించే బంద్ లో మొత్తం 20 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని అంచనా వేస్తున్నాయి కార్మిక సంఘాలు.