ఎడారి ప్రాంతాల్లో గాలులకు ఇసుక కొట్టుకుపోవడం సహజమే. సముద్రం, సరస్సుల దగ్గర పొడిగా ఉన్న ఇసుక కూడా గాలుల తీవ్రతకు కదులుతుంటుంది. అయితే.. అమెరికాలోని మిచిగాన్ సరస్సు దగ్గర తడిగా ఉన్న ఇసుక బలమైన గాలులకు కొట్టుకుపోయింది. ఈ క్రమంలో కొన్ని ఆకృతులు ఏర్పడ్డాయి.
సముద్ర స్నానానికి వెళ్లినప్పుడు పిల్లలు ఇసుకతో ఆడుకుంటూ రకరకాలు ఆకృతులను చేస్తారు. అచ్చం అలాగే ఏదో మనిషి చేసినట్లే మిచిగాన్ తీరంలో వెరైటీ ఆకారాలు ఏర్పడ్డాయి. ఎంతో చూడచక్కగా ఉన్న వీటి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
కొందరు నెటిజన్లు మాత్రం ఇది ఫోటోషాప్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకుముందు ఎన్నడూ ఇలాంటివి చూడలేదని అంటున్నారు. మిచిగాన్ లో నివసించే వ్యక్తులు కూడా ఇది నిజం కాదని పోస్టులు పెడుతున్నారు. ఓ వ్యక్తి మిచిగాన్ సరస్సు దగ్గరే పెరిగాను.. ఇలాంటివి ఇంతకుముందు చూడలేదని కామెంట్ పెట్టాడు.
మరికొందరు మాత్రం ఇది నిజమేనని వాదిస్తున్నారు. ఓ నెటిజన్ కొన్నేళ్ల క్రితం ఇదే విధమైన చిత్రాన్ని తాను చూసినట్లు తెలిపాడు. అచ్చం ఇలాంటి ఆకృతులనే వీక్షించినట్లు ట్వీట్ చేశాడు.