సాధారణంగా ఎమ్మెల్యే ఎన్నికలు ఎలా జరుగుతాయని ఎవరినైనా అడిగితే ఏం చెబుతారు. ప్రజలు ఓట్లు వేస్తే.. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే.. వాళ్లు ఎమ్మెల్యేగా గెలుస్తారని సమాధానమిస్తారు. అయితే, ఇదే ప్రశ్నను ఇటీవల జరిగిన ఏడో తరగతి సోషల్ స్టడీస్ ఆన్యువల్ ఎగ్జామ్‌లో అడుగగా.. ఓ స్టూడెంట్ రాసిన ఆన్సర్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పరీక్షల్లో రాసిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలంలోని లింగారెడ్డిగూడ ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి.. పరీక్షల్లో రాసిన సమాధానం అందరినీ ఆలోచింపజేస్తోంది. ఎమ్మెల్యే ఎన్నికలు ఎలా జరుగుతాయన్న ప్రశ్నకు ఆ విద్యార్థి ఈ విధంగా జవాబు రాశాడు.
‘ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటింటికి వచ్చి నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోమని చెప్తారు. ప్రచారం చేస్తారు. 18 సంవత్సరాలు నిండిన వాళ్లకు ఓటు హక్కు ఉంటుంది. వాళ్లకు పైసలు ఇస్తారు. బిర్యానీలు, మందు బాటిల్స్, ఆడవాళ్లకు చీరలు ఇస్తారు. ఎలక్షన్లలో ప్రజలు ఎన్నుకుంటారు. ప్రభుత్వం ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారిని గెలిచినట్లు ప్రకటిస్తారు.’ అని సమాధానం రాశాడు.
చైల్డ్ సైకాలజీలో ‘ప్రత్యక్ష అనుభవం’ కిందికి వచ్చే ఇలాంటి ఘటనలు చిన్నారుల లేత మనస్సులపై చెరగని ముద్ర వేస్తాయని, ఈ జవాబుపత్రంలోనూ అదే కనిపించిందని ఓ సైకాలజిస్టు విశ్లేషించారు. ఇక, ఈ జవాబుకు ప్రశ్నపత్రం దిద్దిన ఉపాధ్యాయుడు నాలుగు మార్కులు వేయడం గమనార్హం.