కరీంనగర్ జిల్లాలో విషాదం నెలకొంది. బావిలో చెత్త తొలగించేందుకు దిగి విద్యార్థి మృతి చెందాడు. సెయింట్ ఆంటోనీ స్కూల్ లో ఇది జరిగింది. దీనికి కారణమైన వార్డెన్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
వివరాల్లోకి వెళ్తే.. తిమ్మాపూర్ లో సెయింట్ ఆంటోనీ స్కూల్ ఉంది. అక్కడి స్కూల్ ఆవరణలో ఓ బావి ఉంది. దాని నిండా చెత్తాచెదారం పేరుకుపోయింది. దీంతో విద్యార్థులకు పని చెప్పాడు వార్డెన్. మొత్తం నలుగురిని బావిలోకి దింపాడు. అయితే మారం శ్రీకరం అనే విద్యార్థి బావిలో మునిగిపోయాడు. మిగిలిన ముగ్గురు భయంతో పైకి వచ్చేశారు.
విషయం జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్ కు కబురు పంపారు. శ్రీకర్ మృతదేహాన్ని బయటకు తీశారు. తల్లిదండ్రులకు విషయం తెలిసి వెంటనే అక్కడకు చేరుకున్నారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
స్కూల్ యాజమాన్యంపైనా తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. స్టూడెంట్స్ తో ఇలాంటి పనులు ఎలా చేయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు విద్యార్థులను బావిలోకి దింపిన స్కూల్ వార్డెన్ ను అదుపులోకి తీసుకున్నారు.