మెడికో ప్రీతి ఘటన వెనుక ర్యాగింగ్ భూతం ఉంది. సీనియర్ వేధింపులు తాళలేక ఆమె చివరకు చనిపోయింది. ఇది ఆత్మహత్యా? హత్యా? అనేది తేలాల్సి ఉంది. కుటుంబసభ్యులు మాత్రం ముమ్మాటికీ ఇది హత్యేనని అంటున్నారు. దీనిపై వివాదం కొనసాగుతుండగానే తెలంగాణలో మరో ఘటన వెలుగుచూసింది.
ఓ విద్యార్థి వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. భూపాలపల్లికి చెందిన శంకరాచారి, రమ దంపతులు. వీరికి రక్షిత అనే అమ్మాయి ఉంది. వరంగల్ జిల్లా నర్సంపేట లోని జయముఖి ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీ మూడవ సంవత్సరం చదువుతోంది.
అయితే.. రక్షితకు చెందిన ఫోటోలను ఓ విద్యార్థి సోషల్ మీడియాలో పెట్టాడని.. దీంతో మనస్థాపానికి గురైన యువతి వరంగల్ లోని తన బంధువుల ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని అంటున్నారు.
మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. మరోవైపు రెండు రోజుల క్రితం భూపాలపల్లిలో రక్షితపై మిస్సింగ్ కేసు నమోదైంది. అయితే.. ర్యాగింగ్ అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో వరంగల్ సీపీ స్పందించారు. ఇదంతా అబద్ధమని.. ప్రేమ ఇష్యూలో ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలిపారు.