మెడికో ప్రీతి మృతి నేపథ్యంలో ఆగ్రహజ్వాలలు రగులుతున్నాయి. ప్రీతి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలంటూ వికారాబాద్ జిల్లా పరిగి బస్టాండ్ వద్ద యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసనకు దిగారు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని ప్రభుత్వంపై మండిపడ్డారు. నిత్యం ఏదో ఒక చోట ర్యాగింగ్, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఆస్పత్రిలో ప్రీతి చికిత్స పొందుతున్నప్పుడు ప్రభుత్వం సైలెంట్ గా ఉందన్నారు.
కానీ ఆమె మరణించగానే ప్రభుత్వం ఇప్పుడు కంటి తుడుపు చర్యలు చేపట్టిందని విద్యార్థులు ఫైర్ అయ్యారు.
అసలు తెలంగాణ రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నారా అంటూ వారు ప్రశ్నించారు. ఉంటే పాలన చేత కాకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ప్రీతి లాగా మరో అమ్మాయికి అన్యాయం జరగొద్దంటే ఆమె మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు అన్నారు. వారిపై చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్, ఎన్ఎస్ యుఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.