ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు,నిరుద్యోగులు ప్రగతి భవన్ ను ముట్టడించారు. పేపర్ లీకేజీ ఘటనపై ముఖ్యమంత్రి తక్షణమే స్పందించాలని, ప్రభుత్వం సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ చేయించాలని ఛలో ప్రగతి భవన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన టిపిబిఓ, ఏఈ, గ్రూప్ వన్ తదితర పేపర్ లీకేజ్ ఘటనలపై ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరిని నిరసిస్తూ, తక్షణమే నిరుద్యోగ అభ్యర్థులకు భరోసా కల్పిస్తూ వారికి న్యాయం చేయాలని పిడిఎస్ యూ డిమాండ్ చేసింది.
ఈ క్రమంలో విద్యార్థి యువజన నేతలకు ,పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పోలీసులు విద్యార్థి, యువజన సంఘాల నాయకులను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా పిడి ఎస్ యూ ఆల్ ఇండియా కన్వీనర్ ఆఫ్ యూనివర్సిటీస్ నాగేశ్వర్ రావు మాట్లాడుతూ టీఎస్పీ ఎస్సీ బోర్డు, తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలు ఆగం అయ్యే పరిస్థితులు నెలకొన్నాయని మండిపడ్డారు.
రాష్ట్రంలో వరుసగా పేపర్లు లీక్ అయ్యి..నిరుద్యోగులు ఆత్మస్థైర్యం కోల్పోతుంటే ముఖ్యమంత్రి కనీసం ఈ ఘటన పై స్పందించకపోవడం దారుణం అని అన్నారు. తెలంగాణ లో పేపర్ లీకేజీలు యధేచ్ఛగా జరుగుతుంటే బోర్డు చైర్మన్ చోద్యం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ,బోర్డు అధికారులు ఈ పేపర్ లీకేజీ ఘటన కి నైతికత బాధ్యత వహిస్తూ తక్షణమే రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
అదే విధంగా వరుసగా పేపర్ లీకేజీల ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాలపై సిట్టింగ్ జడ్జ్ చేత న్యాయ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి,నిరుద్యోగ అభ్యర్థులకు భవిష్యత్ లో ఉద్యోగాల రిజిస్ట్రేషన్ కోసం ఉచితంగా అవకాశం కల్పించాలని కోరారు. తక్షణమే ఈ లీకేజీ ఘటనల పై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలని, నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే విద్యార్థి సంఘాలు పోరాటాలను తీవ్రతరం చేస్తాయని హెచ్చరించారు.