టీఎస్పీఎస్సీ పరీక్షా పత్రం లీకేజీ వ్యవహారంపై నిరసన జ్వాలలు రగులుతున్నాయి. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ రోజు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు టీఎస్పీఎస్పీ కార్యాలయ ముట్టడికి ప్రయత్నించాయి.
ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నిన్నటి పరిణామాల నేపథ్యంలో ఈ రోజు పోలీసులు ముందే అప్రమత్తమయ్యారు. టీఎస్పీఎస్పీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. కార్యాయంలోకి చొచ్కుకు వచ్చేందుకు ప్రయత్నించిన ఏబీవీపీ,ఆప్, ఇతర విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
ఆ తర్వాత ఏబీవీపీ కార్యకర్తలను అరెస్టు చేసి బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ.. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేసీఆర్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
అనంతరం టీఎస్పీఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఎస్ఎఫ్ఐ నేతలు ప్రయత్నించగా వారిని అరెస్టు చేసి బేగం బజార్ పోలీసు స్టేషన్ కు తరలించారు. ఆప్ విద్యార్థి విభాగం నేతలను అదుపులోకి తీసుకుని గోషా మహల్ కు తరలించారు.
మరోవైపు పేపర్ లీకేజీ ఘటనపై ఓయూలోను విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు. దీనిపై సిట్టింగ్ జడ్డితో విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో వారిని అరెస్టు చేసి ఓయూ పీఎస్‌కు తరలించారు. ఇక జిల్లాల్లోనూ భారీగా నిరసనలు జరిగాయి.
ఖమ్మంలో పీవైఎల్, పీడిఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగులు, పెద్దఎత్తున నిరసనకు దిగారు. కేంద్ర గ్రంథాలయం నుంచి మయూరి కూడలి వరకు భారీ ర్యాలీ తీశారు. అటు ఆదిలాబాద్‌లో బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వినాయక్‌చౌక్‌లో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్దం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.