ఎల్లారెడ్డి పేట్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్ధులు దర్నాకు దిగారు. స్థానికంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సాధించుకునేందకు ఎన్నో ఉద్యమాలు చేశామని ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ మరవేని రంజిత్ కుమార్ అన్నారు. మంత్రి కేటీఆర్ 2017 ఏప్రిల్ 22 న హామీ ఇచ్చి ఇంతవరకు నెరవేర్చలేదని మండిపడ్డారు. విద్యార్థులను మోసం చేసిన కేటీఆర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
త్వరలోనే మంత్రికి మంచి గుణ పాఠం చెప్తామని ఆయన అన్నారు. ప్రైవేట్ డిగ్రీ కళాశాల కోసం.. ప్రభుత్వం డిగ్రీ కళాశాల రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో పార్టీ కోసం ఫండ్స్ ఇచ్చిన వారి కోసం కేటీఆర్ చాలా శ్రమిస్తున్నారని వ్యాఖ్యానించారు. మంత్రి గారి కొడుకు కూతురు ఏమో కార్పొరేట్ సంస్థల్లో చదువుకుంటే.. మరి మా పేద, బడుగు బలహీన వర్గాల, గిరిజన విద్యార్థులు ప్రభుత్వం డిగ్రీ చదువులకు నోచుకోకుండా చేస్తున్నారెందుకు.. మేమేం పాపం చేశామని ప్రశ్నించారు.
అనేక ఉద్యమాలు చేసినప్పటికీ.. స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు. అందుబాటులో ప్రభుత్వ కళాశాల లేకపోవడంతో బడుగు బలహీనత వర్గాల పేద ప్రజలు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డిపేట్ మండలంలో ప్రతీ ఏడాది రెండు వేల మంది విద్యార్ధులు ఇంటర్ పూర్తి చేస్తున్నారని తెలిపారు.
అందులో ప్రైవేట్ కళాశాలలకు వెళ్లి ఫీజులు కట్టి చదువుకునే స్థోమత లేని పిల్లలే ఎక్కువగా ఉన్నారని అన్నారు. అందరికి అందుబాటులో ఉండేలా వీలైనంత తొందరగా మండలానికి డిగ్రీ కళాశాలను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు రంజిత్ కుమార్.