తెలంగాణ సర్కార్ ఓ వైపు గురుకులాల విషయంలో గొప్పలు చెబుతుంటే.. వాటి పరిస్థితి మాత్రం రోజురోజుకు చాలా హీనంగా తయారవుతుంది. చదువు విషయం కాస్త పక్కన పెడితే.. సరిగ్గా ఆహారాన్ని కూడా విద్యార్థులకు అందించలేని దుస్థితిలో ఉన్నాయి గురుకులాలు. కుళ్లిపోయిన కూరగాయాలతో కూరలు,పురుగులు నిండి రవ్వతో ఉప్మా.. పిల్లల ప్రాణాల మీదకు తెస్తుంది. ఇలాంటి ఆహారాన్ని తిని విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం కూడా సర్వసాధారణంగా మారిపోయింది.
తాజాగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్ లో ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయంలో 16 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురవ్వడం కలకలం రేపింది. ఇక విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం.. గత మూడు రోజులుగా పాఠశాలలో పెడుతున్న ఆహారం సరిగా ఉండటం లేదట. ఆదివారం బయటి నుంచి ఆహారం తెప్పించారు సిబ్బంది. ఇక సోమవారం ఉదయం వండిన కూరలు మంగళవారం పెట్టారని విద్యార్థినులు చెబుతున్నారు.
ఇదేంటని మేడమ్ ని అడిగితే నిన్నటివి కాదని బెదిరించడంతో అవి తిన్న వారికి విరేచనాలు అయ్యాయని వాపోయారు. సోమవారం ఉదయం చేసిన శనగలు, స్నాక్స్ మంగళవారం పెట్టారని అవి తిన్నావారు అస్వస్థతకి గురయ్యారని చెబుతున్నారు. మా పరిస్థితి గురించి ఎస్ఓకి చెప్పినా.. బయట పని ఉందని పట్టించుకోకుండా వెళ్లి మళ్ళీ తిరిగి రాలేదని విద్యార్థినులు చెబుతున్నారు.
ఇక ఈ విషయాలేవీ ఎవరికి చెప్పకండి.. మా ఉద్యోగాలు పోతాయని మిగతా మేడంలు ప్రాధేయపడ్డారని వారు తెలిపారు. అయితే మా ప్రాణాల గురించి ఎవరికి పట్టింపు లేదని, ఎన్ని సార్లు ఆహారం బాగా లేకున్నా సర్డుకుపోయాం, కానీ మా ఆరోగ్యం మీదకు వచ్చాక కూడా అలానే సర్దుకుపొమ్మని అంటున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సంఘటన గురించి తెలుసుకున్న బీజేపీ నాయకులు పన్నల తిరుపతి రెడ్డి అస్వస్థతకు గురైన పిల్లల ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని పరామర్శించారు. అయితే జిల్లా కేంద్రంలో ఉన్న కస్తూర్బా విద్యాలయంలోనే పరిస్థితి ఇలా ఉంటే మారు మూల ప్రాంతాల్లో ఉన్న విద్యాలయాల పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.