మహబూబాబాద్ జిల్లా గార్ల ఎస్సీ బాలికల హాస్టల్ విద్యార్థినులు ధర్నాకు దిగారు. హాస్టల్ లో నాణ్యమైన భోజనం పెట్టాలంటూ డిమాండ్ చేశారు. పురుగుల అన్నం పెడుతున్న హాస్టల్ వార్డెన్ వెంటనే సస్పెండ్ చేయాలంటూ నినాదాలు హోరెత్తించారు.
గార్ల నెహ్రూ సెంటర్ లో విద్యార్థులు, తల్లిదండ్రులు, కుల సంఘాల నాయకులతో కలిసి గురువారం ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి హాస్టల్ వార్డెన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని, నాణ్యమైన ఆహారం పెట్టాలని డిమాండ్ చేశారు.
హాస్టల్ లోని బియ్యం, చింతపండును రోడ్డుపై ప్రదర్శించి.. నిరసన వ్యక్తం చేశారు. వారానికి మూడు సార్లు ఎగ్స్ పెట్టాలని ఉన్నా.. ఒక్కసారి కూడా పెట్టడం లేదని విద్యార్థునులు వాపోయారు. కనీసం హాస్టల్ డోర్స్ కు కూడా తాళాలు లేవన్నారు.
ఇదే విషయంపై తమకు క్లారిటీ ఇచ్చేందుకు జిల్లా కలెక్టర్ రావాలంటూ నినాదాలు చేశారు. కలెక్టర్ వచ్చేంత వరకూ ఆందోళన విరమించబోమని తేల్చి చెప్పారు. విద్యార్థుల నిరసనతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.