టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి, కమిషన్ ఛైర్మన్ ను వెంటనే భర్తరఫ్ చేయాలని ఓయూ జేఏసీ, టీఎస్ జేఏసీ నాయకులు ఆందోళన చేపట్టారు.
ఈ మేరకు గురువారం ఛలో ప్రగతి భవన్ కార్యక్రమం తలపెట్టి ఓయూ లైబ్రరీ నుండి ర్యాలీగా బయలు దేశారు. అయితే అప్పటికే మోహరించిన పోలీసు బలగాలు.. వారిని అడ్డుకున్నారు. దీంతో నిరసనకారులు యూనిర్సిటీ మెయిన్ రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.
ఈ సంరద్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. కేసీఆర్ అవినీతి పాలనలో విద్యార్థులు, నిరుద్యోగులు బలైపోతున్నారన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటుంటే.. కొడులు ల్యాండ్ మాఫియా.. కూతురు లిక్కర్ స్కామ్ లతో అవినీతి పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. పేపర్ లీకేజీ ఘటనపై సీబీఐ చేత విచారణ జరపించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వంతో పాటు టీఎస్పీఎస్సీ పూర్తిగా విఫలం అయిందన్నారు. రాష్ట్రంలో పేపర్ లీకేజీ ఘటనలు వరుసగా జరగడం సిగ్గుచేటన్నారు. వెంటనే బోర్డు ఛైర్మన్ జనార్థన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని పిలుపునిచ్చారు నాయకులు. అనంతరం ఉద్రిక్తత కొనసాగడంతో.. పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.