బాసర ట్రిపుల్ ఐటీ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉంటూనే ఉంటుంది. మొన్నామధ్య హాస్టల్ ఫుడ్ విషయంలో విద్యార్థులు నిరసన బాట పట్టారు. తాజాగా పలు సమస్యలను పరిష్కరించాలని ధర్నాకు దిగారు. ప్రధాన కార్యాలయం ముందు బైఠాయించారు. వందలాది మంది విద్యార్థులు క్లాసులు బహిష్కరించి ఆందోళన బాట పట్టారు.
క్యాంపస్ కు రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ ను నియమించాలని, ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, విద్యార్థులకు లాప్ టాప్ యూనిఫాం అందించాలని, తాగునీటి పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు విద్యార్థులు. అయితే.. విద్యార్థులు ఆందోళన విషయం బయటకు రాకుండా ఉండేందుకు ఇంటర్నెట్ బంద్ చేయించారు. మీడియాను కూడా లోపలికి అనుమతివ్వ లేదు.
ఇటు విద్యార్థుల సమస్యలు తెలుసుకుందామని వెళ్లిన నాయకులకు కూడా ఎంట్రీ లేదు. పలువుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటు విద్యార్థులు చేస్తున్న ధర్నాకు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ మద్దతు తెలిపారు. స్టూడెంట్స్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Advertisements
స్థానిక బీఎస్పీ నేతలు బాసర ట్రిపుల్ ఐటీ దగ్గర ఆందోళనకు దిగారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని మెయిన్ గేటు వద్ద ధర్నా చేపట్టారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వెళ్లనివ్వలేదు. ట్రిపుల్ ఐటీని అస్తవ్యస్తంగా మార్చి విద్యార్థులను వేధిస్తున్నారని బీఎస్పీ నేతలు మండిపడ్డారు.