పార్టీ అధ్యక్షుడి జన్మదినం అంటే.. కిందిస్థాయి నాయకులు హడావుడి చేయడం కామన్. పెద్దోళ్ల కంట్లో పడితే.. సేఫ్ గా ఉండొచ్చనేది వారి ఐడియా. అందుకే బర్త్ డే గానీ, ఆవిర్భావ దినోత్సవం గానీ వస్తే చాలు.. వారికున్న పరిజ్ఞానంతో అధినేతను మెప్పించేందుకు నానా తంటాలు పడుతుంటారు. అయితే.. ఓ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ చేసిన పని.. విద్యార్థులకు కష్టం.. తల్లిదండ్రులు, సంఘాలకు కోపం తెప్పించింది.
రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ జన్మదిన వేడుకలు టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. పెద్ద పెద్ద కటౌట్లు, ఫ్లెక్సీలతో ఎక్కడచూసినా గులాబీమయం చేశారు. అయితే.. కేసీఆర్ బర్త్ డే సందర్భంగా వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టడం వివాదాస్పదమైంది.
ఏదో టీఆర్ఎస్ నాయకుడిలా.. అధినేత మెప్పుకోసం ప్రయత్నించినట్లు.. విద్యార్థులను ఎండలో కేసీఆర్ అనే పేరు కనిపించేలా ఒంగించి కూర్చోబెట్టడంపై సంఘాల నేతలు, పేరెంట్స్ మండిపడుతున్నారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే సస్పెండ్ చేయాలని అంటున్నారు. అభిమానం ఉంటే.. ప్రిన్సిపాల్, టీచర్లే ఎండలో కూర్చోవొచ్చుగా.. చిన్నపిల్లలతో చేయిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జేజే యాక్ట్ ఏం చెబుతోంది..?
ది జువైనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్-2015 ప్రకారం.. 18 ఏళ్లు నిండని పిల్లలు ఎటువంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. అలాగే.. ర్యాలీలు, జన్మదిన కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయడం నేరం. అలా చేసిన వారిపై జిల్లా బాలల పరిరక్షణ సమితి, సీడబ్ల్యూసీ అధికారులు క్రిమినల్ కేసు పెట్టే అవకాశం ఉంటుంది.