హన్మకొండ కాకతీయ యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థినిలు గత కొన్ని రోజులుగా హాస్టల్ వసతి కల్పించాలని వీసీ రమేష్ ను కలిసి సమస్యను తెలిపారు. నిరుపేద కుటుంబంలో పుట్టి చదువు కోవాలని ఎన్నో కష్టాలను అధిగమించి కేయూలో సీటు సంపాదించామన్నారు. తల్లిదండ్రులు కాయ కష్టం చేసి వచ్చిన కూలి పైసలతో వేల రూపాయల ఫీజులు కట్టినా.. హాస్టల్ వసతి కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు 40 మంది విద్యార్థినిలు రాస్తారోకో, నిరసన వ్యక్తం చేయడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ..కలెక్టరేట్ లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసిన విద్యార్థినులను అడ్డుకున్నారు.
దీంతో వారికి పోలీసులకు మధ్య చిన్న పాటి తోపులాట జరిగింది. పోలీసులు విద్యార్థినులను పోలీస్ వాహనంలో ఎక్కించడంతో.. వారు కంటతడి పెట్టుకున్నారు. లక్షల రూపాలయ జీతం తీసుకుంటున్న యూనివర్సిటీ అధికారులు విద్యార్థుల సమస్యలను తీర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉన్నత చదువులు చదివి యూనివర్సిటీలో సీటు తెచ్చుకుంటే ఆకలి బాధతో చదవ లేక పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు యూనివర్సిటీ అధికారులను, వీసీని కలిసినా సమస్య పరిష్కారం కాకపోవడంతో జిల్లా కలెక్టర్ కు విన్నవించుకుందామంటే.. కలవనివ్వకపోవడం బాధాకరమన్నారు.