– క్లాస్ రూమ్ కి హిజాబ్ లేకుండానే హాజరు
కర్ణాటకలో హిజాబ్ వివాదం క్రమేపీ సద్దుమణుగుతోంది. వేసవి సెలవుల అనంతరం కోస్తా ప్రాంతమైన దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లోని అనేక కళాశాలల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ లేకుండానే కాలేజీకి వచ్చారు. ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా తొలిరోజు గడవడంతో విద్యాశాఖ మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
ఎక్కడా ఎలాంటి వివాదాలు లేకుండా తొలిరోజు ప్రశాంతంగా జరగడం సంతోషంగా ఉందని విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్ వెల్లడించారు. హైకోర్టు తీర్పును అందరూ గౌరవించాలని ఆయన విద్యార్థులకు సూచించారు. హిజాబ్ ను నిషేధిస్తూ ఇప్పటికే విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని, వీటిని ఉల్లంఘించిన వారికి కళాశాలల్లోకి ప్రవేశం ఉండదని ఆయన స్పష్టం చేశారు. కేవలం రాజకీయం చేసేందుకే ఈ విషయంపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేశాయని, బీజేపీ ప్రభుత్వం తీసుకున్న చొరవతో పరిస్థితి శాంతించిందని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు మైనార్టీల సంక్షేమం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి నాగేశ్ వివరించారు. మైనార్టీలు ఉన్నతంగా రాణించేందుకు బీజేపీ కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు. అదేవిధంగా హైకోర్టు తీర్పును ప్రజలందరూ గౌరవించాలని కోరారు.
హిజాబ్ వివాదం ప్రారంభమైన దక్షిణ కన్నడ, ఉడిపి ప్రాంతాలలో ఈ ఏడాది ముస్లిం విద్యార్ధినుల సంఖ్య పెరగడం ఆసక్తి రేపుతోంది. పలువురు ముస్లిం నేతల విజ్ఞప్తులను విద్యార్ధినుల తల్లిదండ్రులు ఆచరించారు. కనీసం ఈ ఏడాదైనా చదువు సక్రమంగా సాగేలా చూడాలని వారు కోరుకుంటున్నారు.