భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాలేజీ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఓ అమ్మాయి విషయంలో తలెత్తిన వివాదం కొట్టుకునే వరకు వెళ్లింది. సీనియర్లు,జూనియర్లు గల్లాలు పట్టుకొని తగువు లాడుకోవడంతో రచ్చ.. రచ్చ అయింది.
ఇక వివరాల్లోకి వెళితే..అశ్వారావు పేటకి చెందిన ఇద్దరు విద్యార్థులు సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. కాలేజీ నుండి ఇంటికి వెళ్లే క్రమంలో సీనియర్ విద్యార్థినిని జూనియర్ విద్యార్థి అసభ్యంగా తాకడానికి ప్రయత్నించాడనే నెపంతో జూనియర్ విద్యార్థి కరుణాకర్ పై సీనియర్లు మందల పల్లి వద్ద బస్సును ఆపి దాడికి దిగారు.
కరుణాకర్ పై దాడి జరిగిందనే విషయం తెలుసుకున్న జూనియర్ తరుపు బంధువులు, ఫ్రెండ్స్ నాలుగు కార్లలో మందలపల్లి వెళ్లి ఘర్షణ జరుగుతున్న బస్సులోకి చొరబడ్డారు. అప్పటికే తన సోదరుడిపై దాడికి దిగారన్న సంగతి తెలుసుకున్న జూనియర్ విద్యార్థి అన్న తన స్నేహితులతో కలిసి సీనియర్లపై దాడికి దిగాడు.
దీంతో సినిమా సీన్ తలపించేలా..ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ.. కాలేజీ బస్సును బాక్సింగ్ రింగ్ గా మార్చేశారు. ఘర్షణ అనంతరం ఒకరిపై ఒకరు అశ్వారావు పేట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. అయితే సీనియర్ విద్యార్థి ప్రవీణ్ కి జూనియర్ విద్యార్థినులు మద్దుతు తెలిపారు. తప్పంతా సీనియర్ విద్యార్థిదే అని సీనియర్ విద్యార్థినులు జూనియర్ కు సపోర్ట్ చేశారు. మొత్తం విషయాన్ని ఆరా తీసిన పోలీసులు ఇరువర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చే పనిలో పడ్డారు.