తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక డైరీ ఆవిష్కరణ-2023 కార్యక్రమం శనివారం సాయంత్రం 3:30 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించగా.. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, సీనియర్ సంపాదకులు ఐ శ్రీనివాస్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి, సీనియర్ జర్నలిస్టులు, టీయూడబ్ల్యు నేత విరాహత్ అలీ, విజయకుమార్ రెడ్డి, జయసారథి రెడ్డి, వేణు నాయుడు, శ్రీనివాస్, తొలి వెలుగు రఘు, జర్నలిస్టులు అధ్యయన వేదిక ప్రధాన కార్యదర్శి సాదిక్, సంయుక్త కార్యదర్శి మధు, కార్యదర్శి & కోశాధికారి సురేష్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విరాహత్ అలీ మాట్లాడుతూ.. మీడియా చేయలేని బాధ్యతను తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక చేస్తుందన్నారు. ఐజేయూ నేత శ్రీనివాస్ రెడ్డి.. భావ ప్రకటన స్వేచ్ఛకు కేంద్రంగా తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక నిలిచిందని, ఇది అన్ని వర్గాలకు అందుబాటులో ఉండాలని కోరుతున్నానన్నారు.
మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి మాట్లాడుతూ.. సమాజంలో జర్నలిస్టుల బాధ్యత చాలా పెద్దదన్నారు. ప్రజాస్వామ్యంలో ఓపెన్ గా, ధైర్యంగా మాట్లాడేది జర్నలిస్టులే అన్నారు. అమ్ముడు పోయే జర్నలిస్టులు కూడా ఉన్నారన్నారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ.. సత్యం రాజ్యమేలే చోట పని చేస్తామనే జర్నలిస్టులు ఉన్నారన్నారు.
ఇందుకు ఉదాహరణ.. ఎన్డీటీవీ జర్నలిస్టు రవీశ్ కుమార్ లాంటి వారని చెప్పొచ్చన్నారు. ప్రశ్నించడం పాలకులకు ఇష్టం లేదు.. జర్నలిస్టులే చర్చవేదిక పెట్టడం అభినందనీయమన్నారు. వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చే వేదికన్నారు. సీనియర్ జర్నలిస్టు ఎస్ విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టులు సామాజిక సమస్యల పరిష్కార వేదికగా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.