అర్ధరాత్రి నడిరోడ్డుపై ఆటోలతో స్టంట్స్ చేస్తూ.. ప్రయాణికులను భయబ్రాంతులకు గురి చేసిన ఆరుగురిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అత్యంత ప్రమాదకర విన్యాసాలతో లారీలని ఓవర్ టేక్ చేయడమే కాకుండా.. పెద్ద పెద్ద కేకలతో స్థానికులను భయాందోళనలకు గురిచేశారని దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్ తెలిపారు.
ఈ నెల 24 అర్ధరాత్రి సమయంలో బాబానగర్ చాంద్రాయణగుట్ట రోడ్డుపై 3 ఆటోలతో విన్యాసాలు చేశారని తెలిపారు. ప్రమాదకరంగా ఆటోలు నడుపుతూ, అలజడి సృష్టిస్తూ.. రోడ్లపై చేసిన స్టంట్స్ ను కొందరు ప్రయాణికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. వాటి ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఆయన తెలిపారు.
ఆటో నెంబర్ ల ఆధారంగా ఆటోలు నడిపిన 7 మందిని గుర్తించినట్టు వెల్లడించారు. అందులో ఆరుగురిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. అతివేగంతో నడుపుతూ తోటి ప్రయాణికులను భయబ్రాంతులకు గురి చేస్తే చట్టరీత్య చర్యలు తప్పవని హెచ్చరించారు.
నిందితులపై కేసు నమోదు చేసి.. వారి వద్ద నుండి 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నామన్నారు ఫలక్ నుమా ఏసీపీ మాజిద్. మరో ఆటోతో పాటు డ్రైవర్ మహ్మద్ ఇబ్రహీం పరారీలో ఉన్నట్టు ఆయన వెల్లడించారు. అదపులోకి తీసుకున్న ఆరుగురిని శుక్రవారం రిమాండ్ కు తరలించినట్టు ఏసీపీ వెల్లడించారు.