ఉత్తరప్రదేశ్ లోని సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత అజాంఖాన్ తనయుడు, ఆ పార్టీ ఎమ్మెల్యే అబ్దుల్లా అజాం ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పు నిచ్చింది. యూపీలోని రాంపూర్ జిల్లా సువార్ నియోజకవర్గానికి అబ్దుల్లా అజాం ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన వయసుకు సంబంధించిన తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించారని కాంగ్రెస్ నేత నవాబ్ కాజిం అలీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు తప్పుడు డాక్యుమెంట్ సమర్పించింది నిజమేనని దృవీకరించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ తీర్పు నిచ్చింది. ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీసం 25 ఏళ్లు ఉండాలని ఎన్నికల కమిషన్ నిబంధన ఉండగా, ఎన్నికలు నిర్వహించేనాటికి (2017) అబ్దుల్లా వయస్సు 25 ఏళ్లకంటే తక్కువగా ఉందని జస్టిస్ ఎస్‌పీ కేసర్వాని సారథ్యంలోని బెంచ్ తన తీర్పులో స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వ్యాఖ్యానించేందుకు అబ్దుల్లా అజాం నిరాకరించారు. అబ్దుల్లా సన్నిహితుడు మాత్రం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని చెప్పారు.