పువ్వుల లుంగీ.. చిరిగిన చొక్కాతో పాత బైక్ మీద తిరుగుతున్న వ్యక్తిని ఎవరైనా అధికారని అనుకుంటారా..? కానీ.. కృష్ణాజిల్లా కైకలూరులో జరిగింది. రైతు వేషంలో ఓ ఎరువుల షాపు దగ్గరకు వెళ్లారు సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్. వచ్చింది అధికారి అని తెలియక.. షాప్ లో స్టాక్ ఉన్నా లేదని చెప్పాడు అందులోని వ్యక్తి. దీంతో పక్కనే ఉన్న ఇంకో దుకాణానికి వెళ్లారు సబ్ కలెక్టర్. అక్కడ ఎరువులు ఇచ్చారు కానీ.. ఎమ్మార్పీ రేటు కంటే అధికంగా డబ్బులు వసూలు చేశారు. అదేంటని అడిగితే.. తీసుకుంటే తీసుకో, లేకపోతే పో అంటూ నిర్లక్ష్యపు సమాధానం వచ్చింది.
ఎరువుల దుకాణాల్లో పరిస్థితిని గమనించిన ప్రవీణ్ చంద్.. వెంటనే సంబంధిత అధికారులందరినీ ఫోన్ చేసి పిలిపించారు. ఆ రెండు షాపులపై కొరడా ఝులిపించారు. సీజ్ చేసి, కేసులు నమోదు చేశారు. తనిఖీ కోసం సబ్ కలెక్టర్ మారువేషంలో వచ్చారని తెలియగానే యజమానులు షాక్ తిన్నారు. ఎవరైనా అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హచ్చరించారు ప్రవీణ్ చంద్.