తెలుగు రాష్ట్రాల సమస్యలపై చర్చించేందుకు నియమించిన త్రిసభ్య కమిటీ తొలి భేటీ జరిగింది. విద్యుత్, బకాయిలు, ఆర్థిక వ్యవహారాలు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, సివిల్ సప్లై కార్పొరేషన్లపై చర్చించారు. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు తమ వాదనలు కమిటీకి వినిపించారు. ముఖ్యంగా ఐదు అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది.
ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిల అంశంపై కీలక చర్చ జరిగినట్లు సమాచారం. తెలంగాణకు రావాల్సిన రూ.12,532 కోట్లు ఇవ్వకుండా ఏపీ కోర్టుకు వెళ్లిందని తెలంగాణ తెలిపింది. కోర్టు కేసులను వెనక్కి తీసుకుంటే.. విద్యుత్ బకాయిల సమస్య పరిష్కారానికి తాము రెడీ అని చెప్పింది. పన్నులకు సంబంధించి విభజన చట్ట సవరణ అవసరం లేదని తెలిపారు.
తెలంగాణ వాదనతో కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్ కుమార్ ఏకీభవించగా… పన్నుల అంశం ద్వైపాక్షిక జాబితా నుంచి తొలగించేందుకు అంగీకారం కుదిరింది. అయితే.. ఏపీ నుంచి నగదు బకాయిలు వెంటనే వచ్చేలా చూడాలని తెలంగాణ కోరింది. దీనిపై పూర్తి వివరాలు పంపాలని సూచించారు ఆశిష్ కుమార్. కేంద్ర రాయితీలో తెలంగాణ వాటా చెల్లించేందుకు సిద్ధమని ఏపీ అధికారులు ప్రతిపాదించింది. దీనిపై అండర్ టేకింగ్ ఇచ్చేందుకు ఏపీ పౌరసరఫరాల సంస్థ సిద్ధమని ప్రకటించింది. ఏపీ అండర్ టేకింగ్, రాయితీ వాటా ఇస్తే రూ.354 కోట్ల చెల్లింపునకు తెలంగాణ పౌరసరఫరాల సంస్థ ఓకే చెప్పింది.
ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజనను ఏపీ సర్కార్ ఏకపక్షంగా చేసి ప్రతిపాదనలు పంపిందన్నారు తెలంగాణ అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా 235 ఎకరాలకు సంబంధించి కోర్టును ఆశ్రయించిందని చెప్పారు. ప్రధాన కార్యాలయం కాని.. నానక్ రామ్ గూడలోని భవనంలో వాటా అడగడం సమంజసం కాదని తెలిపారు. వీటి కారణంగానే ఏపీఎస్‌ఎఫ్‌సీ విభజన పెండింగ్ లో పడిందన్నారు. కోర్టు కేసులు ఉపసంహరించుకుంటేనే విభజన ప్రక్రియలో ముందుకెళ్లాలని తమ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు వివరించారు తెలంగాణ అధికారులు.