సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం పక్కా కుట్ర అని పోలీసులు గట్టిగా చెబుతున్నారు. ఈ మేరకు విచారణ ఆ కోణంలో కొనసాగించారు. ప్రధాన సూత్రధారిగా మొదటి నుంచి అనుమానిస్తున్న ఆవుల సుబ్బారావును అరెస్ట్ కూడా చేశారు. అతడితోపాటు అల్లర్లతో ప్రమేయమున్న అనుచరులు మల్లారెడ్డి, బసిరెడ్డి, శివని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మొత్తం నలుగురుని అనేక కోణాల్లో విచారించిన పోలీసులు.. కీలక విషయాలు రాబట్టారు. యువతను రెచ్చగొట్టారని మెయిన్ హెడ్ సుబ్బారావేనని తేల్చారు. దీంతో అతడికి గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించి.. రైల్వేకోర్టులో హాజరుపరిచారు. అలాగే.. మల్లారెడ్డి, బసిరెడ్డి, శివని కూడా న్యాయమూర్తి ఎదుట హాజరుపరించారు.
ఈ కేసులో సుబ్బారావుకు రైల్వే కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నలుగురు నిందితులను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. సుబ్బారావు అరెస్టుతో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. సికింద్రాబాద్ కు అభ్యర్థులను సుబ్బారావే తరలించాడని.. 8 ఫంక్షన్ హాళ్లలో వారిని ఉంచాడని.. అతని కనుసన్నల్లోనే అల్లర్లు జరిగాయని పోలీసులు కోర్టుకు వివరించారు.
మొత్తం 8 వాట్సాప్ గ్రూప్ లను క్రియేట్ చేసిన సుబ్బారావు.. యువకులను రెచ్చగొట్టాడని పోలీసులు తెలిపారు. బీహార్ తరహాలో విధ్వంసం చేయాలని వాయిస్ మెసేజ్ లు కూడా చేసినట్లు చెప్పారు. ఈ అల్లర్ల కోసం అతను రూ.35వేలు ఖర్చు చేశాడని.. ఫైరింగ్ లో ఒకరు చనిపోవడంతో హైదరాబాద్ నుంచి పారిపోయాడని వివరించారు. ఈ క్రమంలోనే అతడిని 14 రోజుల రిమాండ్ విధించింది రైల్వే కోర్టు.