ఎన్ని ఫ్లాపులొచ్చినా నటీనటులు సినిమాలు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే, ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ వస్తుందనే ఆశ. నితిన్ లాంటి హీరోకు కూడా వరుసగా 10 ఫ్లాపులొచ్చాయి. ఆ తర్వాత సక్సెస్ అయ్యాడు. నితిన్ ది కేవలం ఎగ్జాంపుల్ మాత్రమే. ఈ లిస్ట్ చెప్పుకుంటే చాంతాడంత అవుతుంది. దీనికి క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా మినహాయింపు కాదు. అలా తన కెరీర్ లో ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్.
యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ అయిన కొన్ని నెలలకే అవకాశం అందుకున్నారట సుధాకర్. కానీ ఆశించిన స్థాయిలో బ్రేక్ రాలేదు. తర్వాత 2 సినిమాలు ఆగిపోయాయి కూడా. అలాంటి టైమ్ లో అనుకోని వరంగా సితార సినిమా వచ్చిందట. అప్పటికే ఏడాదిన్నరగా సినిమాల్లేక ఇబ్బంది పడుతున్న సుధాకర్ కెరీర్ ను ఆ సినిమా మార్చేసింది.
శుభలేఖ సినిమాలో నటించి దాన్నే తన ఇంటిపేరుగా మార్చుకున్న సుధాకర్.. సితార సినిమాను మాత్రం తన కెరీర్ లో ప్రత్యేకమైన చిత్రంగా చెబుతారు. ఆ తర్వాత ద్రోహి, శివ లాంటి సినిమాలు తన కెరీర్ కు బాగా హెల్ప్ అయ్యాయని అన్నారు.
40 ఏళ్ల కెరీర్ లో కేవలం 140 సినిమాలు మాత్రమే చేశారు సుధాకర్. మధ్యలో దాదాపు ఏడేళ్ల పాటు బుల్లితెరకే పరిమితమవ్వడం, అంతకంటే ముందు తమిళ సినిమాల వైపు వెళ్లడంతో కౌంట్ తగ్గిందన్నారాయన. ఇన్నేళ్ల కెరీర్ లో ఒక్కసారి కూడా జడ్జి వేషం వేసే అవకాశం రాలేదు. ఎట్టకేలకు శ్యామ్ సింగరాయ్ సినిమాలో జడ్జి వేషం వేశారు సుధాకర్. ప్రస్తుతం సినిమా అవకాశాలు బాగా వస్తున్నాయని, కానీ ఆర్థికంగా మాత్రం నిలదొక్కుకోలేకపోయానని అంటున్నారు శుభలేఖ సుధాకర్.