రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగే అమిత్ షా సభను విజయవంతం చేసి.. కేసీఆర్ చెంపను చెల్లుమనిపిస్తామని వ్యాఖ్యానించారు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఈ సందర్భంగా సభాప్రాంగణాన్ని పరిశీలించారు. అధికారం ఉందని పిచ్చి లేచినట్టు కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తూ.. తండ్రి కొడుకులు పబ్బం గడుపుతూ విషం కక్కుతున్నారని విమర్శించారు ఈటల.
టీఆర్ఎస్ పాలన పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉందని విరుచుకుపడ్డారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధి చేశానని.. ఇక దేశాన్ని ఉద్దరిస్తానంటూ కేసీఆర్ పగటి కలలు కంటున్నారని విమర్శలు గుప్పించారు. పగటి కలలకు ఖర్చు ఉండదని అన్నారు కిషన్ రెడ్డి. కుటుంబ పాలనను ప్రజల మీద రుద్దుతున్నారని విరుచుకుపడ్డారు. ఈ రాష్ట్రం అంతా కల్వకుంట్ల గుప్పిట్లో ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
ఇంటింటికి డబ్బులు పంపించిన గ్రేటర్ లో గెలవలేక పోయారని అన్నారు. హుజూరాబాద్ లో వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ.. అక్కడి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లాలో నిర్వహించే సభలో అమిత్ షా స్పష్టమైన సందేశం ఇవ్వబోతున్నారని తెలిపారు. కుటుంబ, అవినీతి పాలనకు చరమ గీతం పాడాలని అమిత్ షా తెలంగాణ ప్రజలకు పిలుపునివ్వబోతున్నారని తెలిపారు.
కుట్రతో, కుటిల నీతితో టీఆర్ఎస్ పాలన కొనసాగిస్తోందని ఆరోపించారు కిషన్ రెడ్డి. సంజయ్ యాత్రకు భారీ స్పందన వస్తుందని కొనియాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు మేమే అన్ని చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటోందని.. వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకే సంజయ్ పాదయాత్ర ప్రారంభించారని పేర్కొన్నారు. రైతుల గురించి కాంగ్రెస్ మాట్లాడడం తప్పేమీ లేదన్నారు కిషన్ రెడ్డి.